
- టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందులో భాగమే: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక జరిగింది
- బొగ్గు గని కార్మికులకు బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాజకీయ కుట్రలో భాగంగానే తనను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందులో భాగంగానే కొత్త గౌరవాధ్యక్షుడిని ఎన్నుకున్నట్టు కనిపిస్తోందన్నారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా సంఘం సెంట్రల్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించి కొత్త గౌరవాధ్యక్షుడిని ఎన్నుకున్నారని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా తనపై కక్షగట్టారని మండిపడ్డారు. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులెవరో చెప్పాలని అడిగినందుకు తనపైనే కక్షగట్టారని, ఆ కుట్రదారులే వివిధ రూపాల్లో వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడి ఎన్నికపై గురువారం ఆమె బొగ్గు గని కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. ‘‘కొన్నాళ్లుగా బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు మీకందరికీ తెలిసే ఉంటుంది. పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను లేఖ ద్వారా తెలియజేశాను. నా తండ్రి కేసీఆర్ కు నేను గతంలోనూ ఇలాంటి లేఖలు ఎన్నో రాశాను.
అయితే, నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కేసీఆర్ కు రాసిన ఆ లేఖను ఎవరో లీక్ చేశారు. ఆ లేఖను లీక్ చేసి.. నాపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని నేను కోరాను. ఇప్పుడు కూడా ఆ కుట్రదారులే నాపై కుట్ర పన్ని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పించి ఉంటారు’’ అని ఆమె పేర్కొన్నారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష ఎన్నిక నిర్వహించారని, ఆ విషయాన్ని పక్కనపెడితే ఇందులో రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతుంటే.. కొందరు తనపైనే కుట్రలు పన్నుతున్నారని కవిత ఆరోపించారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టమేమీ లేకపోయినా కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తనను తొలగించి కార్మికుల ఐక్యతను దెబ్బతీయడమే వారి లక్ష్యంగా కనిపిస్తున్నదన్నారు. టీబీజీకేఎస్‌లో పదేండ్లపాటు యాక్టివ్‌గా పనిచేశానని కవిత అన్నారు. కార్మికుల సంక్షేమం కోసమే ప్రయత్నించానని పేర్కొన్నారు. ఇప్పుడు టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటానని కవిత తన లేఖలో పేర్కొన్నారు.