హైదరాబాద్, వెలుగు: శాసన మండలిలోనూ బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. శనివారం ప్రతిపక్ష ఎమ్మెల్సీల నిరసన మధ్య ‘ది తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులరేషన్ అమెండ్‌మెంట్ బిల్–2026’ పాస్ అయింది. ప్రశ్నోత్తరాలు, స్పెషల్ మెన్షన్ ప్రోగ్రాంపూర్తయిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు యూరియాపై చర్చకు పట్టుబడ్డారు. దీనిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ చదివి రిజెక్ట్ చేశారు.
శుక్రవారమే మండలిలో యూరియాపై చర్చ జరిగిందని గుర్తు చేశారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మండలిలో ప్రవేశపెట్టి.. అందులోని అంశాలను చదివి వినిపించారు. సభలో ఉన్న 11 మంది బీఆర్ఎస్ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ పోడియం వద్దకు వచ్చారు. వారి నిరసనల మధ్యనే మండలి చైర్మన్ సభ్యుల ఆమోదంతో బిల్ పాస్ అయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత సభకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మిగిలిన సెషన్స్‌లో పాల్గొనకుండా బైకాట్ చేసి వెళ్లిపోయారు. కాగా, శాసనమండలి తొలి సెషన్ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరి తొలిసారి రాగా.. మండలి తరఫున చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు.
