రాష్ట్రానికి ఏమిచ్చారు? తొమ్మిదేండ్లుగా అన్యాయం:ఎంపీ నామా

రాష్ట్రానికి ఏమిచ్చారు?  తొమ్మిదేండ్లుగా అన్యాయం:ఎంపీ నామా
  • అయినా అన్నిట్లో నంబర్​ వన్​గా ఉన్నం
  • అమెరికాలో కరెంట్​ పోతది కానీ తెలంగాణలో పోదు
  • లోక్​సభలో అవిశ్వాస తీర్మానంపై 
  • చర్చలో నామా నాగేశ్వర్​రావు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, వెలుగు: మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ తొమ్మిదేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్​రావు అన్నారు.  ‘‘కేంద్రం సహకరించకపోయినా దేశంలోనే తెలంగాణ నంబర్​ వన్​గా ఉంది. ధాన్యం ఉత్పత్తి, తలసరి ఆదాయం, ఇతర అంశాల్లో అగ్రభాగంలో ఉంది” అని నామా  తెలిపారు. తెలంగాణలో భూముల రేట్లు బాగా పెరిగాయని, రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎకరానికి రూ. 2 లక్షలుంటే, ఇప్పుడు 30 లక్షలకు చేరిందని చెప్పారు.

బుధవారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్  తరఫున నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో పవర్ పోతుంది కానీ, తెలంగాణలో పవర్ కట్ అనేదే ఉండదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రం అంధకారంలో ఉండేదని, ఇప్పుడు దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రతి ఇంటికి ఫిల్టర్ నీళ్లు ఇస్తున్నామన్నారు. విభజన చట్టం ప్రకారం ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ, ఈ కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్, మహారాష్ట్ర కు తరలించి, వ్యాగన్ రిపేర్ షెడ్​ను కేంద్రం ఇచ్చిందని దుయ్యబట్టారు. ఐఐఎం ఇవ్వలేదని, ట్రైబల్ యూనివర్సిటీ పూర్తికాలేదని అన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కేటాయించి, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని తెలిపారు.

 ఒక్కో జిల్లాకు నవోదయ విద్యాలయం ఇవ్వాలన్న నిబంధనను కేంద్రం అమలు చేయడంలేదన్నారు. తెలంగాణ కు మంజూరు అయిన ఐటీఐఆర్ ను కూడా క్యాన్సల్ చేసిందని విమర్శించారు. హర్ ఘర్ జల్ స్కీం కింద కూడా రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సహకారం అందించలేదన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ రేట్ల కట్టడిలో కేంద్ర ప్రభుత్వం వైఫలమైందని విమర్శించారు. తాము బీజేపీ, కాంగ్రెస్ పక్షాన లేమని.. దేశ ప్రజల పక్షాన ఉన్నామని నామా నాగేశ్వరరావు చెప్పారు. మణిపూర్ ఘటనతో ప్రపంచం ముందు భారత్ తల దించుకోవాల్సి వచ్చిందని అన్నారు. మణిపూర్ ఘటనపై ప్రధాని మాట్లాడితే.. ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.