
- లాస్య నందిత సోదరికి కేటాయించిన కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్‌ను దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదితకు ఇస్తున్నట్టు బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ బుధవారం ప్రకటించారు. పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరిలో మరణించడంతో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ టికెట్‌ను సాయన్న బిడ్డ లాస్య నందితకు ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత 2024 ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఎన్నికలతో పాటు, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. సాయన్న మరణం, ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే లాస్య చనిపోవడంతో ఆ కుటుంబంపై నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఈ నేపథ్యంలో సాయన్న కూతురు నివేదితకే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో కంటోన్మెంట్ టికెట్ ఆశించిన పార్టీ నాయకులు గజ్జెల నగేష్, మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులకు మరోసారి నిరాశ తప్పలేదు.