నిర్మల్​లో లోకల్​ బాడీస్ హస్తగతం .. కాంగ్రెస్ లోకి వరుస కడుతున్న గులాబీ నేతలు

నిర్మల్​లో లోకల్​ బాడీస్ హస్తగతం .. కాంగ్రెస్ లోకి వరుస కడుతున్న గులాబీ నేతలు
  • జిల్లాలో బీఆర్​ఎస్​ ఆఫీసు వెలవెల 
  • నిర్మల్ జిల్లాలో మారుతున్న  పాలిటిక్స్

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో రాజకీయ పరిణామాలు  మలుపు తిరుగుతున్నాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో  నిర్మల్, ముధోల్ సెగ్మెంట్లలో  కాంగ్రెస్  డిపాజిట్లు  సైతం కోల్పోయినప్పటికీ ప్రస్తుతం     చేరికలతో  కలకలలాడుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలంతా  కాంగ్రెస్  లో చేరుతున్నారు.   స్థానిక  సంస్థలు కూడా కాంగ్రెస్ ​ఖాతాలోకి వెళ్తున్నాయి.  గత 20 రోజుల  నుంచి నిర్మ ల్, ముధోల్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్  నాయకులంతా   కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు.  ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు    కాంగ్రెస్ లోకి జంప్​ అవుతున్నారు.  

  •  నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.  
  •  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కడెం ఎంపీపీ అలెగ్జాండర్ తోపాటు మెజార్టీ ఎంపీటీసీలు  కాంగ్రెస్ లో చేరడంతో ఆ మండలం 
  • హస్తగతమైంది.
  • బైంసా మండలం ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ కి చెందిన మైనార్టీ ఎంపీటీసీ రజాక్ అక్కడి మండల ఎంపీపీగా ఎన్నికయ్యారు.  
  • కొద్ది రోజుల క్రితం ఖానాపూర్ మున్సిపాలిటీలో 
  • బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో  అక్కడ అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాసంలో బీఆర్ఎస్ చైర్మన్ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ కు చెందిన కౌన్సిలర్ రాజుర సత్యం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. పీఏసీఎస్​  చైర్మన్ కూడా బీఆ ర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. 
  • బీఆర్ఎస్ కు చెందిన లక్ష్మణ చందా ఎంపీపీ పద్మ రమేశ్​ ఆ పార్టీని వీడారు. 
  • మామడ ఎంపీపీ అమృత జైసింగ్, వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి  కాంగ్రెస్ లో చేరిపోవడంతో ఇక్కడి మండల పరిషత్   కాంగ్రెస్ గుప్పిట్లోకి చేరిపోయింది. 
  • సారంగాపూర్ మండల  బీఆర్​ఎస్​ ఎంపీపీ  జాదవ్ సునీత పదవి చేపట్టిన గంటలోనే డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో  చేరారు. 
  •  నిర్మల్ లో మున్సిపల్ రాజకీయం ఆసక్తికరంగా మలుపులు తిరిగింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సన్నిహితుడైన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తో పాటు దాదాపు 20 మంది మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు  రాజీనామా చేసి  సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.  దీంతో నిర్మల్ మున్సిపాలిటీ బీఆర్ ఎస్  చేజారింది. 
  •   బీఆర్ఎస్  జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డితో పాటు నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తో పాటు పలువురు మాజీ మార్కెట్ క మిటీ చైర్మన్ లు, సింగిల్ విండో చైర్మన్లు  కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

  బీఆర్ఎస్ డీలా

  జిల్లాలో  రోజురోజుకు బీఆర్​ఎస్​ పార్టీని   ప్రజాప్రతినిధులు, నేతలు, సీనియర్ కార్యకర్తలు వీడుతుండటంతో  ఆ పార్టీ ఢీలా పడింది. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.    సీనియర్ నేతలంతా  పార్టీ మారడంతో  ఆ పార్టీకి నాయకత్వ కొరత ఏర్పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం  జిల్లాలో దిశా నిర్దేశం చేసే నేతలే కరువయ్యారంటున్నారు. ఇప్పటివరకు ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిని సైతం నియమించలేదు.  కొండాపూర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం  వెలవెలబోతోంది.  ప్రస్తుతం పార్టీలో మిగిలి ఉన్న కార్యకర్తలంతా ప్రతిరోజు చేరికల వార్తలను చూసి గందరగోళానికి గురవుతున్నారు. మరో వారం పది రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయమన్న అభిప్రాయాలు వెళ్లడవుతున్నాయి