కొత్తగూడెంలో దర్జాగా సర్కార్ ల్యాండ్ కబ్జా

కొత్తగూడెంలో దర్జాగా  సర్కార్ ల్యాండ్ కబ్జా
  •     భూమి విలువ రూ. 18కోట్ల పైనే 
  •      బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు, నేతల హస్తం
  •     తప్పుడు  పత్రాలతో పట్టాల కోసం దరఖాస్తు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో దాదాపు రూ. 18కోట్ల విలువైన సర్కార్​ ల్యాండ్​ను  బీఆర్ఎస్​ పార్టీ కౌన్సిలర్లు, నేతలు దర్జాగా కబ్జా చేశారు.  ల్యాండ్​కు తప్పుడు ధృవీకరణ పత్రాలతో జీఓ. 76 ప్రకారంగా పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ల్యాండ్​ కబ్జా అవుతున్నా మున్సిపల్​, రెవెన్యూ ఆఫీసర్లు తమకు సంబంధం లేదనట్టుగా వ్యవహరిస్తున్నారు. 

కబ్జాలో రూ. కోట్ల విలువైన ల్యాండ్​ :

 కొత్తగూడెం నడిబొడ్డున రూ. కోట్ల విలువైన గవర్నమెంట్​ఖాళీ స్థలాలపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు, నేతలపై కన్ను పడింది. వెంటనే  కబ్జా చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. అధికారులను మచ్చిక చేసుకొని కబ్జా పెటారు.142 సర్వే నెంబర్ లోని రైతు బజార్ సెంటర్ లో ఉన్న దాదాపు 494 గజాల భూమిని బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ భర్త ఆక్రమించారు.   మరో 494 గజాలను మరోనేత కబ్జా చేశారు. ఇక్కడ గజం దాదాపు రూ. లక్ష ధర పలుకుతోంది. 

రైతు బజార్​కు సమీపంలో గాజుల రాజం బస్తీలోని  దాదాపు 311 గజాల స్థలాన్ని మరో బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ భర్త ఆక్రమించుకున్నారు. ఈ ప్రాంతంలో గజం ల్యాండ్​ దాదాపు రూ. 50వేల నుంచి రూ. 75వేల వరకు ధర పలుకుతోంది. బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు, నేతలు ఆక్రమించుకున్న ల్యాండ్​ విలువ దాదాపు రూ. 10 నుంచి రూ. 12కోట్ల వరకు ఉంటుంది. 

సింగరేణి స్థలాల్లో ఎప్పటి నుంచో ఉంటున్న వారు జీఓ. 76 ప్రకారం తమ వద్ద ఉన్న ఆధారాలతో పట్టా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆధారాలను పరిశీలించిన అనంతరం ఆఫీసర్లు పట్టాలను జారీ చేస్తారు. కబ్జా చేసిన కౌన్సిలర్లు, నేతలు తాము ఎప్పటి నుంచో ఉంటున్నట్టు ఇంటి నెంబర్​ తీసుకోవడంతో పాటు ఆ ల్యాండ్​ను ఇతరుల వద్ద కొనుక్కున్నట్టుగా డాక్యుమెంట్లను సృష్టించారు. 

ఆఫీసర్ల నిర్లక్ష్యం

  33వ వార్డులో సుమారు రూ. 3.50కోట్ల విలువైన దాదాపు 350 గజాల గవర్నమెంట్ ల్యాండ్​ను కొందరు బీఆర్ఎస్​నేతలు  ఆక్రమించుకొని నిర్మాణం చేస్తుండగా సమాచార హక్కు చట్టం కో ఆర్డినేషన్​ మెంబర్​ రఘుమాచారితో పాటు స్థానికులు కలెక్టర్​కు ఇటీవల  కంప్లైంట్​ చేశారు. సర్కార్​ ల్యాండ్స్​ కబ్జా అవుతుంటే  మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లు తమకేమి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుండడం పట్ల  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 విచారణ చేస్తున్నాం..


కొత్తగూడెం పట్టణంలో 142 సర్వే నెంబర్ లోని రైతు బజార్​ ప్రాంతంతో పాటు గాజుల రాజం బస్తీలో గల విలువైన గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణలకు గురైన విషయం మా దృష్టికి నిన్ననే వచ్చింది. ఆ ల్యాండ్ గవర్నమెంట్​దా?, సింగరేణి సరెండర్ చేసిన స్థలమా? సింగరేణి ఆధీనంలోనే ఉందా అనే విషయమై విచారణ చేస్తున్నాం. ఆక్రమించుకున్న స్థలాలకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమే. దరఖాస్తులను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం.  ల్యాండ్ ను ఆక్రమిస్తే విచారణ అనంతరం ఆ భూమిని స్వాధీనం చేసుకుంటాం. 
 - పుల్లయ్య, తహసీల్దార్, కొత్తగూడెం