టీడీపీ పోటీలో ఉంటదా? ఎటూ తేల్చని పార్టీ అధినాయకత్వం

టీడీపీ పోటీలో  ఉంటదా?  ఎటూ తేల్చని పార్టీ అధినాయకత్వం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో టీడీపీ పోటీ చేస్తుందా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. ఎన్నికల బరిలో నిలవాలని రాష్ట్ర నాయకత్వం ఆశిస్తుండగా, పార్టీ అధినాయకత్వం మాత్రం పోటీపై ఇప్పటివరకు ఎటూ తేల్చలేదు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతుండగా.. టీడీపీలో ఎలాంటి ఎన్నికల కసరత్తు జరగడం లేదు. గతేడాది నుంచే రాష్ట్రంలో టీడీపీ యాక్టివిటీస్ పెరగ్గా, తీరా ఎలక్షన్ టైమ్ లో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు అరెస్టు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఎటూ తేల్చకపోవడంతో, ఆ పార్టీ ఇక్కడ చేతులెత్తేసినట్టేనని ప్రచారం జరుగుతున్నది. 

ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర ముఖ్యనేతలు పార్టీ మారాల నే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఎన్నికలకు దూరం గా ఉంటే, ఇక పార్టీలో ఉండి ఏం లాభమనే అసంతృప్తి వారిలో ఉన్నట్టు సమాచారం.

ముదిరాజ్​లకు దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం.. 

టీడీపీ ఎన్నికల బరిలో ఉండకపోతే.. పార్టీ మారాలని రాష్ట్ర ముఖ్య నేతలు భావిస్తున్నారని తెలిసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ బీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన బీఆర్‌ఎస్‌లోని ఓ సీనియర్‌ నేతతో పాటు ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన నేతతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌కు ముదిరాజ్‌ సామాజిక వర్గం దూరమవుతున్న నేపథ్యంలో కాసానిని పార్టీలో చేర్చుకుని ఆ వర్గానికి దగ్గరయ్యేందుకు గులాబీ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ సీటు ఇస్తామని కాసానికి బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాగా, జ్ఞానేశ్వర్ సోదరుడి కొడుకు వీరేశ్ బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. ఆయన పరిగి టికెట్‌ ఆశిస్తున్నారని తెలిసింది. 

చంద్రబాబుతో ములాఖత్ కోసం ప్రయత్నాలు.. 

టీడీపీ చీఫ్ చంద్రబాబుతో ములాఖత్ అయి, తదుపరి కార్యాచరణ ప్రకటించాలని రాష్ట్ర నాయకత్వం చూస్తోంది. కానీ ఇప్పటివరకు చంద్రబాబుతో ములాఖత్‌ కు చాన్స్ దొరకలేదు. రెండ్రోజుల్లో ములాఖత్‌ లభిస్తుందని జ్ఞానేశ్వర్‌ ఆశాభావంతోఉన్నారు. ఇప్పటికే కాసాని వీరేశ్.. రాజమండ్రికి వెళ్లి చంద్రబాబుతో ములాఖత్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ శుక్రవారం కూడా ములాఖత్‌ దొరికే చాన్స్​ లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ములాఖత్‌ దొరికేదెన్నడో.. టీడీపీ భవితవ్యం తేలేదెన్నడోననే సందిగ్ధం నెలకొంది. 

బోసిపోయిన  ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌.. 

ఎన్నికల వేళ అన్ని పార్టీల కార్యాలయాలు నేతలు, కార్యకర్తలతో కళకళలాడుతున్నాయి. కానీ, టీడీపీ ఆఫీస్ ఎన్టీఆర్ భవన్ బోసిపోయి కనిపిస్తోంది. అక్కడ కార్యకర్తల సందడి కనిపించడం లేదు. ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. కాగా, తెలంగాణ వచ్చినంక రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కొన్ని సీట్లయినా గెలిచి సత్తా చాటిన టీడీపీ.. ఈసారి పోటీ చేసే పరిస్థితిలో కూడా లేకపోవడం గమనార్హం.