కోదండరాంను చట్టసభకు పోనియ్యరా?

కోదండరాంను చట్టసభకు పోనియ్యరా?
  • కోదండరాంను  చట్టసభకు పోనియ్యరా?
  • బీఆర్​ఎస్​ తీరుపై టీజేఎస్​ రాష్ట్రవ్యాప్త నిరసనలు
  • కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం
  • సిటీ సెంట్రల్​ లైబ్రరీలో మోకాళ్లపై కూర్చున్న నిరుద్యోగులు
  • ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్​ కాలేజీలో ఆందోళనలు

వెలుగు, నెట్​వర్క్:  ప్రొఫెసర్ కోదండరాంను చట్టసభకు వెళ్లకుండా బీఆర్ఎస్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం టీజేఎస్​ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. గ్రేటర్​హైదరాబాద్​తోపాటు ఆయా జిల్లా కేంద్రాల్లో టీజేఎస్​శ్రేణులు బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులు, నిరుద్యోగులు మోకాళ్ల మీద నిలబడి, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యమ ద్రోహులు అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జేఏసీ చైర్మన్ కోదండరాంను గత ప్రభుత్వం అడుగడుగునా అణచివేసిందని టీజేఎస్​నగర అధ్యక్షుడు ఎం. నరసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ మేరకు టీజేఎస్​నాయకులు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిరసనకు దిగారు. కేసీఆర్, కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  దిష్టిబొమ్మలను దహనం చేశారు. విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్​కాలేజీ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జన సమితి రాష్ర్ట అధ్యక్షులు  మాసంపల్లి అరుణ్​కుమార్​మాట్లాడుతూ.. సకల జనుల సేనాని ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ రాకుండా కేసీఆర్​అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జన సమితి రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, ఓయూ అధ్యక్షుడు రమేశ్ యాదవ్, రాష్ట్ర నాయకులు డప్పు గోపి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల్లో నిరసనలు

కోదండరాంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ టీజేఎస్, అఖిలపక్షం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం గద్వాలలో నిరసన చేపట్టారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడి నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కేసీఆర్, బీఆర్ఎస్  పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో టీజేఎస్ లీడర్​ పుప్పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రెస్​మీట్​పెట్టి బీఆర్ఎస్​తీరుపై మండిపడ్డారు. నిర్మల్​జిల్లా టీజేఎస్​అధ్యక్షుడు తిలక్​రావు ఆధ్వర్యంలో ఖానాపూర్​పట్టణంలో తెలంగాణ చౌరస్తా వద్ద నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన ర్యాలీ తీశారు. సంగారెడ్డి జిల్లా టీజేఎస్​అధ్యక్షుడు తుల్జా రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్​దిష్టిబొమ్మను దహనం చేశారు.