
హైదరాబాద్ : పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు అధికార పార్టీ నాయకులు మహాధర్నా చేపట్టారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు గ్యాస్ సిలిండర్లు, కట్టెల మోపులతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ధరలు తగ్గించాలె : దానం
2014లో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 1200కు పెంచి.. ప్రజలపై భారం మోపుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. మహిళ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెంచిన గ్యాస్ ధరలను గిఫ్ట్ గా ఇచ్చిందంటూ సెటైర్ వేశారు. ఇప్పటికైనా కేంద్రానికి కనువిప్పు కలిగి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
కుత్బుల్లాపూర్ లోనూ నిరసనలు
పెంచిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ కుత్బుల్లాపూర్ లో మహిళలు నిరసన చేపట్టారు. సిలిండర్లపై పూలు చల్లి.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల వేళ కామన్ మ్యాన్ గుర్తుకొస్తాడని.. ఎన్నికలు ముగియగానే కార్పొరేట్ మ్యాన్ గుర్తొస్తాడని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యానించారు. పెంచిన ధరలతో తిరిగి కట్టెల పొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తాయని అన్నారు.