మంచిర్యాలలోకి చుక్క బ్యాక్‌ వాటర్‌‌ రాకుండా చూస్తా  : కేసీఆర్‌‌

మంచిర్యాలలోకి చుక్క బ్యాక్‌ వాటర్‌‌ రాకుండా చూస్తా  : కేసీఆర్‌‌

 

మంచిర్యాల, వెలుగు:  బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరికి కరకట్ట కట్టి, మంచిర్యాలలో చుక్క బ్యాక్‌ వాటర్‌‌ రాకుండా చూస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే ఎండకాలంలోనే పనులు మొదలు పెట్టి పూర్తి చేస్తామని చెప్పారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, ములుగు, భూపాలపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌‌ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట.

ఎనకట ఇందిరమ్మ రాజ్యం ఎట్లుండే. బానిస బతుకుల్లాగా ఉండే. ఎన్‌‌కౌంటర్లు, కాల్చి సంపుడేనాయే. ఎమర్జెన్సీ పెట్టి జైళ్లల్లో ఏసిండ్లు. ఇట్లాంటి పాలన మనకు అవసరమా”అని కేసీఆర్‌‌ ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ హయాంలో తాగడానికి నీళ్లు లేక గోస పడ్డం. కరెంట్ లేక రైతులు పాములు, తేళ్లు కుట్టి చనిపోయారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఎన్నడూ ఆలోచించలే. బీఆర్‌‌ఎస్ సర్కారు వచ్చాక నీటి తీరువా రద్దయింది. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఇస్తున్నం. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రైతులకు 3 గంటలు కరెంటు చాలు అని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ అంటున్నరు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామంటున్నరు. ఇలాగైతే రైతుబంధు బంద్‌ అవుతది. రైతుల భూములు కింద మీద అవుతయ్” అని అన్నారు. 

సింగరేణిని నిర్వీర్యం చేసిండ్రు.. 

సింగరేణి సంస్థను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసిందని కేసీఆర్ అన్నారు. అప్పులు తీర్చడం చేతగాక కేంద్రానికి 49 శాతం వాటా అప్పగించారని మండిపడ్డారు. బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం వచ్చాక 15 వేల డిపెండెంట్ జాబ్స్ ఇచ్చామని గుర్తుచేశారు. లాభాల్లో వాటా 32 శాతానికి పెంచామని, రూ.వెయ్యి కోట్ల బోనస్ ఇచ్చామని తెలిపారు. ‘‘సింగరేణి సంస్థ తెలంగాణ కొంగు బంగారం. దానిని విస్తరించుకుంటూ పోతం. సంస్థను మరింత ముందుకు తీసుకుపోతం.

బయ్యారం ఐరన్ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం ముందుకు రాలేదు. అందుకే రానున్న రోజుల్లో బయ్యారం గనులను సింగరేణికే అప్పగిస్తాం’’ అని అన్నారు. కల్యాణ లక్ష్మి స్కీమ్ ఆలోచన ములుగు జిల్లాలో ఉన్న ఒక తండాలో పుట్టింది. గుడిసెకు నిప్పంటుకొని బిడ్డ పెండ్లి కోసం దాచుకున్న రూ.50 వేలు కాలిపోయినయ్‌‌. ఆనాడు ఆ తండ్రి పెట్టుకున్న కంటి తడిని చూసి చాలా బాధపడ్డ. ఇట్లాంటి గోస ఎవరికి రావద్దని అధికారంలోకి రాగానే కల్యాణ లక్షి స్కీం తెచ్చిన’’ అని కేసీఆర్‌‌ అన్నారు. 

బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే..

‘‘దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటీ ఇయ్యలే. ప్రధాన మంత్రికి 100 లెటర్లు రాసినా పట్టించుకోలే. జిల్లాకో నవోదయ స్కూల్ ఇవ్వాలని చట్టం ఉన్నా ఇవ్వలే” అని కేసీఆర్‌‌ అన్నారు. బీజేపీకి ఓటెందుకు వెయ్యాలె? రాష్ర్టానికి ఏం చేశారని ఓటు అడుగుతున్నారు? అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే మోరీల వేసినట్టేనన్నారు. ‘‘ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావొద్దు. ఆలోచించి ఓటు వేయాలి. అభ్యర్థుల గుణగణాలు, వారి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి, మంచి చేసే వారిని ఎన్నుకోవాలి.

రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితమో ప్రజలు ఆలోచించాలి” అని కోరారు. మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే వాడకో పేకాట క్లబ్ వస్తుందని, ఇండ్లు అమ్ముకొని  పేకాటలో పెట్టాల్సి వస్తుందని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని సమ్మక్క తల్లిని మొక్కుకున్నానని, చాలా సార్లు మేడారం వచ్చి బంగారం సమర్పించానని గుర్తుచేశారు. ఆయా సభల్లో మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి అభ్యర్థులు దివాకర్‌‌ రావు, కోరుకంటి చందర్, బడే నాగజ్యోతి, గండ్ర వెంకటరమణా రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్‌‌,  బండా ప్రకాశ్‌, భానుప్రసాద్ రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 

గ్రేటర్ లో కేసీఆర్ సభ రద్దు

శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం కేసీఆర్ నిర్వహించాల్సిన బీఆర్ఎస్​ప్రజా ఆశీర్వాద సభను రద్దు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ఒక ప్రకటనలో తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున సభకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడతారనే ఎన్నికల ప్రచార సభను రద్దు చేశామని పేర్కొన్నారు. కాగా, గ్రేటర్ లోని అన్ని నియోజకవర్గాల నుంచి లక్ష మందిని ఈ సభకు తరలించాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసుకుంది. కానీ వాతావరణం కారణంగా సభ రద్దయింది.