అరబిందో కోసమే బీఆర్ఎస్ సైలెంట్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

అరబిందో కోసమే బీఆర్ఎస్ సైలెంట్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం: లిక్కర్ స్కాంలో సహకరించిన అరబిందో గ్రూపు కోసమే సింగరేణి గనుల కేటాయింపు వేలంపాటలో గత సర్కారు పాల్గొనలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మినరల్స్ యాక్ట్ 1957 కు చేసిన సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి ఇప్పుడు గగ్గోలు పెడుతోందని అన్నారు. బీఆర్ఎస్ తీరు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉందని విమర్శించారు. రాష్ట్రంలో 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని, 22 బొగ్గు గనులు మూసివేతకు గురవుతాయని అన్నారు. 2031 వరకు ఉత్పత్తి జరగాలంటే కొత్త గనులు సంపాదించుకోవాలని అన్నారు. గతంలో ప్రభుత్వం రంగ సంస్థలకు గనులను కోల్ ఇండియా కేటాయించేదని, సవరణల తర్వాత అందరూ వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. వేలంలో పాల్గొనాలని సింగరేణి 2021 లో బోర్డు నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. కానీ నవంబర్ 5వ తేదీన ఆనాటి సీఎం కేసీఆర్ బొగ్గు గనులు తీసుకోవద్దనే నిర్ణయం ప్రకటించారని చెప్పారు. 

దీంతో కోయగూడెం బ్లాక్ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించిన అరబిందో కంపెనీకి దక్కిందన్నారు. సత్తుపల్లి బ్లాక్ ప్రతిమ గ్రూప్ కు చెందిన అవంతిక సంస్థకు దక్కిందని అన్నారు. ఈ రెండు కంపెనీలు బీఆర్ఎస్ నేతలకు సన్నిహితంగా ఉన్న వారివని ఆరోపించారు. ఇక్కడ వద్దని సింగరేణి సంస్థకు చెప్పిన కేసీఆర్ ఒడిశాలో మాత్రం పాల్గొనాలన్నారనిన తెలిపారు.  కేసీఆర్ తెలంగాణకు తలమాణికంగా ఉన్న సింగరేణి  సంస్థను సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ‘కేటీఆర్, హరీశ్ రావు చర్చకు వస్తారా..? నేను ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధం’ అని భట్టి సవాల్ విసిరారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర గనుల శాఖ మంత్రిని కలిసిందని, బొగ్గుగనులను సింగరేణికి వేలం లేకుండా ఇవ్వాలని కోరామని భట్టి చెప్పారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా లేఖ రాస్తామని భట్టి వెల్లడించారు. ప్రధాన మంత్రిని కూడా కలిసి పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. ఈ రెండు బ్లాకులను రద్దు చేసి సింగరేణికి ఇవ్వాలని కోరుతామని అన్నారు. ఇందుకోసం  రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలను కలుపుకొని పోతామని, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భట్టి విక్రమార్క వివరించారు.  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిల పక్షం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ని కలుస్తామని భట్టి విక్రమార్క వివరించారు.