- సెంటిమెంట్‌తో కొట్టాలని చూసినా వర్కవుట్ కాలే
- బాకీ కార్డుల వ్యూహం, హైడ్రాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫెయిల్
- కేటీఆర్ ప్రచారం ప్రభావం చూపలే.. కేసీఆర్ ఫామ్‌హౌస్ వ్యూహాలు ఫలించలే
- గులాబీ ఖాతాలోంచి మరో సిట్టింగ్ సీటు మాయం
హైదరాబాద్, వెలుగు: గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎక్కడైతే తాను స్ట్రాంగ్‌గా ఉన్నానని చూసి కారు మురిసిపోయిందో.. అక్కడ్నే టక్కరై ఆగిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ బైపోల్లో.. ఆయన భార్య సునీతకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది. సిట్టింగ్ స్థానంలో బంపర్ మెజారిటీతో గెలుస్తామని ముందు నుంచీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తూ వచ్చారు.
సెంటిమెంట్ వాడినా, బాకీ కార్డులు పంచినా, హైడ్రాపై విమర్శలు చేస్తూ సమావేశాలు పెట్టినా, గల్లీగల్లీకి కేటీఆర్ తిరిగినా బీఆర్ఎస్ను గట్టెక్కించలేకపోయాయి. ఫామ్‌హౌస్ నుంచే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని చెప్పినా.. అవీ ఫలించలేదు. మొత్తంగా గులాబీ పార్టీ.. సంఖ్యాబలం మరొకటి తగ్గి ఢీలా పడిపోయింది.
సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి..!
అభ్యర్థిని ప్రకటించింది మొదలు బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్‌నే ప్రయోగించింది. గోపీనాథ్ మృతితో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన భార్య సునీతను గెలిపించుకోవాలని ప్రతి మీటింగ్‌లోనూ చెప్పుకుంటూ వచ్చింది. ఆడబిడ్డ అనే సెంటిమెంట్‌నూ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆడబిడ్డపై అందరూ కలిసి దాడి చేస్తున్నారంటూ కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చినా.. మరి వాళ్ల సొంత ఇంటి ఆడబిడ్డపై అడుగడుగునా చేసిన దాడుల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్న చర్చ జనాల్లో ఆలోచన రేకెత్తించింది.
బాకీ కార్డులు వేస్ట్
కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ వాడుకున్న మరో అస్త్రం బాకీ కార్డులు. ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని కేటీఆర్, హరీశ్ సహా బీర్ఎస్ నేతలు జనంలోకి వెళ్లారు. ప్రజలకు కాంగ్రెస్ అనేక హామీలు అమలు చేయక బాకీ పడిందంటూ ‘బాకీ కార్డులు’ల పేరిట ప్రత్యేకంగా పాంప్లెట్లు ముద్రించి పంచింది. బీఆర్ఎస్ నేతలు ఇంటింటికీ తిరిగి వీటిని అందజేశారు. ఆ బాకీ కార్డులను జనం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో హామీలు అమలు కాలేదని, ఇప్పుడు బాకీ కార్డులంటూ ముందుకు వస్తున్నారంటూ తిప్పికొట్టారు.
హైడ్రాపై ఆరోపణలతో వెళ్లినా..!
హైడ్రా చేపడ్తున్న అక్రమాల కూల్చివేతలనూ బీఆర్ఎస్ పార్టీ తన ప్రచారానికి వాడుకున్నది. కాంగ్రెస్‌ది కూల్చే ప్రభుత్వమని కేటీఆర్ పదే పదే ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. జూబ్లీహిల్స్ ఫైట్ కారు వర్సెస్ బుల్డోజర్ అంటూ ప్రచారం చేశారు. ‘‘పేదల ఇండ్లను కూల్చేస్తున్న ప్రభుత్వం పెద్దల ఇండ్ల జోలికి వెళ్లడం లేదు” అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో హైడ్రాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పలువురితో మాట్లాడిచ్చారు. హైడ్రాపై చేసిన ప్రచారాన్ని జనం నమ్మలేదు. పైగా, హైడ్రా వచ్చాక సిటీలో కబ్జాలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం స్థానిక జనంలో కనిపించింది.
దెబ్బకొట్టిన ‘ఫ్యామిలీ’ వివాదం
మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు కూడా బీఆర్ఎస్ను దెబ్బకొట్టాయి. తన కొడుకు గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయని తల్లి పోలీసులను ఆశ్రయించింది. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి, కుమారుడు ప్రద్యుమ్న తారక్ మీడియా ముందుకు వచ్చారు. మొదటి భార్యను తానున్నాక సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారంటూ మాలినీదేవి ప్రశ్నించారు. ఈ విషయంలో తమను బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారంటూ వాళ్లు ఆరోపణలూ చేశారు. ఇటు గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా మీడియా ముందుకు వచ్చి.. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మహానంద కుమారి, మాలినీ దేవి, ప్రద్యుమ్న తారక్ కలిసి శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీసులో ఫిర్యాదు సైతం చేశారు.
కేటీఆర్ చక్కర్లు కొట్టినా..కేసీఆర్ వ్యూహాలు రచించినా..!
జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం కోసం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కన్నా ముందుగానే గ్రౌండ్లోకి దిగింది. డివిజన్ల వారీగా సీనియర్ లీడర్లకు బాధ్యతలు అప్పగించింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దాసోజు శ్రవణ్, తక్కెళ్లపల్లి రవీందర్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వంటి నేతలకు వివిధ డివిజన్ల బాధ్యతలను అప్పగించింది. వాళ్లు ముందు నుంచీ ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇటు కేటీఆర్ కూడా వారం పది రోజుల పాటు ప్రతి డివిజన్‌లోనూ రోడ్‌షోలు నిర్వహించారు. కాంగ్రెస్ చేసిన అక్రమాలంటూ వీడియోలు వేసి ప్రజలకు చూపించారు.
అన్ని డివిజన్లలోనూ తిరిగారు. ఇటు హరీశ్ రావు కూడా యూసుఫ్‌గూడ డివిజన్లో బైక్ ర్యాలీ చేపట్టారు. ఇవేవీ బీఆర్ఎస్ను కాపాడలేకపోయాయి. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌కే పరిమితమైపోయారు. అభ్యర్థి ఎంపిక సహా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫామ్‌హౌస్ నుంచే చేశారు. లీడర్లను అక్కడికే పిలిపించుకుని రివ్యూలు నిర్వహించారు. స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆయన పేరు ఉన్నప్పటికీ ప్రచారానికి రాలేదు. గ్రౌండ్లోకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడంతో జనంలోనూ కేసీఆర్‌పై ఓ రకమైన అభిప్రాయం ఏర్పడిందన్న వాదనలు ఉన్నాయి.
