ప్రభుత్వ మార్పును బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది: కూనంనేని

ప్రభుత్వ మార్పును బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది: కూనంనేని
  • ప్రీప్లాన్డ్ గానే పార్లమెంట్​లో స్మోక్ అటాక్
  • జగన్, కేసీఆర్​లది పొలిటికల్ భేటీ: కె.నారాయణ    

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ప్రభుత్వం, సీఎం మారడాన్ని బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ హడావుడి చేయడం సరికాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త సర్కారుకు కొంత సమయం ఇవ్వాలన్నారు. హైదరాబాద్​లోని మగ్దూం భవన్​లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్ పాషా, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి తదితరులతో కలిసి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి స్థానాలపై ఫోకస్ పెట్టామని చెప్పారు. మొత్తంగా17 స్థానాల్లో కమిటీలను వేస్తామన్నారు. అజీజ్ పాషా మాట్లాడుతూ.. కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కారు ఈవీఎంలను మాత్రమే నమ్ముకున్నదని ఆరోపించారు. ప్రపంచంలో 121 దేశాలు బ్యాన్ చేసిన ఈవీఎం విధానాన్ని ఇండియాలో అమలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.  

ఓట్ల కోసం బీజేపీ ప్రీప్లాన్డ్ చర్యలు..  

దేశంలో ‘ఇండియా కూటమి’ బలపడుతుండటంతో బీజేపీ ప్రీ ప్లాన్డ్ చర్యలకు పాల్పడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. లోక్ సభలో స్మోక్ అటాక్ ఘటన కూడా అందులో భాగంగానే జరిగిందన్నారు. ఇప్పుడు అయోధ్యను అడ్డంపెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రామ మందిరం ప్రారంభోత్సవంతో పాటు ఏ తేదీల్లో ఏం చేయాలన్న కార్యక్రమాలతో బీజేపీ ఒక క్యాలెండర్​ రూపొందించుకున్నదని చెప్పారు. ప్రధాని మోదీ తన గ్రాఫ్ తగ్గుతుందనే భయంతోనే అద్వానీని అడ్డుకుంటున్నారని విమర్శించారు. అయోధ్య వేడుకలకు తమకూ ఇన్విటేషన్ వచ్చిందని, కానీ తాము వెళ్లబోమన్నారు.  ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం కేసీఆర్ భేటీ రాజకీయాల్లో భాగమేనని నారాయణ అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజే నాగార్జున సాగర్ వివాదం తెరపైకి తెచ్చి రెండు రాష్ట్రాల మధ్య గొడవ సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. సెంటిమెంట్​ను రెచ్చగొట్టి కేసీఆర్​ను గెలిపించాలని జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. ఇప్పుడు తనను గెలిపించేందుకు ఏదైనా చేయాలని కోరేందుకే కేసీఆర్ జగన్​ను కలిశారన్నారు. జగన్​కు అతని కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా  దూరమయ్యారన్నారు.