ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ : రామచంద్రరావు

ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ : రామచంద్రరావు

తెలంగాణ ప్రజల సమస్యలు, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. కేసీఆర్ ముందు రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అబ్ కీ బార్ బీ మేరా పరివార్ కా సర్కార్ కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు. రైతుల కోసం కాదు.. తన పరివారం కోసమే బీఆర్ఎస్ పెట్టారని ఆరోపించారు. కుటుంబ ఆకాంక్షలు నెరవేర్చేందుకే కేసీఆర్ బీఆర్ఎస్పెట్టారని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా మారిందని, అత్యాచారాలు, కిడ్నాప్ లు పెరుగుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర పథకాలు ప్రజలకు చేరకుండా చేస్తున్న కేసీఆర్.. రాష్ట్రంలో ఏ గుణాత్మక మార్పు వచ్చిందో చెప్పాలని రామచంద్ర రావు నిలదీశారు.

టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తారనే భయంతోనే బీఆర్ఎస్ తీసుకువచ్చారని రామచంద్రరావు సటైర్ వేశారు. కేసీఆర్ కలలు కలలుగానే మిగిలిపోతాయని బీఆర్ఎస్ ఎన్నటికీ జాతీయపార్టీ గుర్తింపు పొందదని చెప్పారు. రైతులు బీజేపీ వెంట ఉన్నారన్న ఆయన... రైతు సమస్యలను బీజేపీ పరిష్కరిస్తుందని అన్నారు. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారేకన్నా ముందే టీఆర్ఎస్ అవినీతి జాతీయ స్థాయికి చేరిపోయిందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందలేవన్న ఆయన... ఆప్ కు జాతీయ పార్టీగా గుర్తింపు రావడానికి 12 ఏండ్లు పట్టిన విషయాన్ని గుర్తు చేశారు.