బీఆర్ఎస్ పెట్టింది లిక్కర్​ దందా కోసమే : వివేక్​ వెంకటస్వామి

బీఆర్ఎస్ పెట్టింది  లిక్కర్​ దందా కోసమే : వివేక్​ వెంకటస్వామి

మంచిర్యాల, వెలుగు:  ఢిల్లీ తరహాలో దేశవ్యాప్తంగా లిక్కర్​ దందా చేయడానికే సీఎం కేసీఆర్​ టీఆర్ఎస్​ను బీఆర్ఎస్​గా మార్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ సమయంలో మనీశ్ సిసోడియా, రామచంద్ర పిళ్లైతోపాటు మిగతావాళ్లు ఎమ్మెల్సీ కవిత పేరు చెప్పడం వల్లే ఆమెను ఇంటరాగేట్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన వాళ్లపైనే ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు, ఎంక్వైరీలు జరుగుతాయి. నేరం రుజువైతే జైల్లో పెడతారు. వీటితో బీజేపీకి సంబంధం లేదు’’ అని చెప్పారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ, చెన్నూర్​ మండలం గంగారంలో పలు పార్టీలకు చెందిన నాయకులు వివేక్​ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.

తప్పు చేయకపోతే భయమెందుకు?

కవిత12 సెల్​ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసిందని, స్పెషల్​ ఫ్లైట్లలో ఢిల్లీకి ఎందుకు వెళ్లిందని వివేక్​ ప్రశ్నించారు. తప్పు చేయకపోతే కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు భయపడుతున్నారని, స్కామ్​​ చేయకపోతే ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్​చార్జ్ అరవింద్​ మీనన్, రాష్ట్ర కార్యదర్శులు ముల్కల్ల మల్లారెడ్డి, పొనుగోటి రంగారావు, జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్, పెద్దపల్లి లోక్​సభ కోకన్వీనర్​ నగునూరు వెంకటేశ్వర్లుగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.

ఆధారాలు ఉండటం వల్లే లోతుగా విచారణ

‘‘ఢిల్లీలో లిక్కర్​ డిస్ట్రిబ్యూషన్​ గతంలో ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగేది. కొత్త లిక్కర్​ పాలసీలో ప్రైవేట్​ సంస్థల ద్వారా డిస్ట్రిబ్యూషన్​ చేసేలా మార్పులు చేయడం కోసం సౌత్​ గ్రూప్​ ద్వారా ఆప్​ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టాయి. అందుకే సౌత్​ గ్రూప్​నకు 800 లిక్కర్​ షాపులు కేటాయించారు. ఆ సంస్థకు లాభం చేకూర్చడానికే 25 శాతం ఉన్న వ్యాట్​ను ఒక శాతానికి తగ్గించారు. కమీషన్​ను రూ.35 నుంచి రూ.340కి పెంచారు. స్కాంకు సంబంధించిన ఆధారాలు ఈడీ దగ్గర ఉండడం వల్లే మరింత లోతుగా ఇంటరాగేషన్ చేస్తోంది” అని వివేక్​ చెప్పారు. ‘‘కేంద్రం ఏమీ చేయకున్నా తెలంగాణలో సింగరేణిని ప్రైవేట్​పరం చేయవద్దని కేసీఆర్​ అంటారు. ఢిల్లీలోనేమో ఆయన కూతురు లిక్కర్​ డిస్ట్రిబ్యూషన్​ను ప్రైవేట్​పరం చేసే ప్రక్రియ చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్​ భగీరథలో దోచుకున్న సొమ్ముతోనే లిక్కర్​ స్కాం​చేశారు. దీనిపై కేసీఆర్​ సమాధానం చెప్పాలి’’ అని వివేక్​ డిమాండ్​ చేశారు.