95కు పైగా సీట్లు గెలుస్తం .. నాకు ఎలాంటి డౌట్​ లేదు: కేసీఆర్​

95కు పైగా సీట్లు గెలుస్తం .. నాకు ఎలాంటి డౌట్​ లేదు: కేసీఆర్​
  • గజ్వేల్​లో 65 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేలా ప్రాజెక్టులు కట్టుకున్నం
  • పేరుకే అక్కడి ఎమ్మెల్యేను గనీ ప్రజలకు దొర్క.. నా బాధ్యత అలాంటిది
  • వచ్చే టర్మ్​లో  నెలలో ఒక రోజు నియోజకవర్గంలోనే ఉంటానని హామీ 
  • గజ్వేల్​ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం

హైదరాబాద్, వెలుగు:  రాబోయే ఎన్నికల్లో గెలుపుపై తనకు ఎలాంటి డౌట్​లేదని, 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్​ఎస్​ గెలుస్తుందని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘ఎన్నో కష్టాలకోర్చి త్యాగాలు చేసి సాధించుకున్న ప్రగతి ప్రస్థానం కీలకదశకు చేరుకుంది” అని చెప్పారు. మేడ్చల్​ జిల్లా శామీర్​పేట మండలం అంతాయిపల్లిలోని ఎస్ఎన్ఆర్​కన్వెన్షన్​లో శుక్రవారం నిర్వహించిన గజ్వేల్​ముఖ్య నాయకుల సమావేశంలో కేసీఆర్​ మాట్లాడారు.  ‘‘గజ్వేల్​ అభివృద్ధి అయింది..  అభివృద్ధి అయిందని అంటే ఆయింత మొఖం కొడ్తది. మనకు దిష్టికొడ్తది. కావాల్సింది చాలా ఉంది” అని చెప్పారు. నియోజకవర్గంలో ఇంకా డెవలప్​మెంట్​ జరగాల్సి ఉందని, జరిగిన అభివృద్ధితో నేతలు సంతృప్తి చెందొద్దని అన్నారు.

నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊరూరూ తిరిగేది. కానీ, ఇప్పుడున్న బాధ్యత, బరువును బట్టి నాకు ఒకటే ఒక మిస్సింగ్.. పేరుకే గజ్వేల్​ ఎమ్మెల్యేను గనీ అక్కడ ప్రజలకు కనపడ.. దొర్క. అదే పెద్ద ప్రాబ్లమ్​. ప్రామిస్ చేస్తున్న.. నెక్ట్స్​ టైమ్​ నెలలో ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గంలో గడుపుత” అని కేసీఆర్​ తెలిపారు. గజ్వేల్ లో 65 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేలా ప్రాజెక్టుల నిర్మాణం చేసుకున్నామని, ఉజ్వల భవిష్యత్తుకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడ్తాయని  చెప్పారు. గజ్వేజ్​లో గెలువడం కాకుండా పక్కన ఉన్న 3 నియోజకవర్గాలను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరారు. అభివృద్ధి ఆగొద్దంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలనే అవగాహన ప్రజల్లో ఉందని, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

24 ఏండ్ల కింద ఒక్కడినే బయల్దేరిన

24 ఏండ్ల కింద తాను ఒక్కడినే బయల్దేరి ఉద్యమంలోకి వెళ్లానని కేసీఆర్​ తెలిపారు.  ‘‘ఆనాడు  నిస్పృహ, నిస్సహాయత ఉండేది. ఏం చేయాలో తెల్వని పరిస్థితి ఉండేది. ఎక్కడ చూసినా చిమ్మ చీకటి, ఎవరిని కదిలించినా మనోవేదనే ఉండేది. ఉమ్మడి పాలనలో మంజీరా నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసినా నీళ్లు రాకపోయేవి. అప్పుడు ట్రాన్స్​ఫార్మర్స్ కాలిపోతే ఒక్కో బాయికి రూ. 2 వేలు, మూడు వేలు వేసుకొని బాగుచేయించే పరిస్థితి ఉండేది.  కరెంటు బిల్లులు పెంచం అని చెప్పి ఆనాడు చంద్రబాబు మోసం చేసిండు. ఇక లాభం లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన” అని చెప్పారు. కొంతమంది తో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించి పోరాడి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన తెలిపారు. 

అన్నపూర్ణగా తెలంగాణ మారింది

తాను సిద్దిపేట ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు భయంకరమైన కరువు ఉండేదని, అప్పుడు ఆలోచన చేసి లోయర్ మానేరు నుంచి ఎత్తయిన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చామని, ఇదే స్ఫూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నామని కేసీఆర్​ తెలిపారు. ‘‘ఆనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు ఉండె. ఇప్పుడు ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్​నగర్, మెదక్​జిల్లాల ప్రజలు పొట్ట చేతపట్టుకొని చెట్టుకొకరు..

పుట్టకొకరు వెళ్లేవాళ్లు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. వలస పోయినోళ్లు తిరిగి రావడమే కాదు తెలంగాణకే ఇతర రాష్ట్రాల నుంచి వలస రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది” అని అన్నారు.  గత పదేండ్లలో గజ్వేల్​ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందినా ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని ఆయన తెలిపారు. గజ్వేల్​ను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పెద్దనోట్ల రద్దు, కరోనా లాంటి పరిస్థితులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించిందని, దీంతో అనుకున్నంతగా పని చేసుకోలేకపోయామని అన్నారు. ఆర్థిక  ఇబ్బందులు రావడంతో రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయని తెలిపారు.

భూములు పోయిన బాధ చాలా పెద్దదని, నిర్వాసితుడి కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ విషయం తెలుసని చెప్పారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయిన  రైతులందరి సమస్యలన్ని పరిష్కరిస్తానని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణలో మాత్రమే భూగర్భ జలాలు పెరిగాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తోనే ఇది సాధ్యమైందని కేసీఆర్​ అన్నారు. కాంగ్రెస్​లీడర్లు మరికొందరు అడ్డుపడినా కాళేశ్వరం ప్రాజెక్టును, రిజర్వాయర్లను పూర్తి చేసుకున్నామని, రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, ప్రతి ఊరికి నీళ్లు ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు. 

దేశానికే గజ్వేల్​ రోల్​ మోడల్​: మంత్రి హరీశ్​రావు

దేశానికే గజ్వేల్​ రోల్​ మోడల్​ అని మంత్రి హరీశ్​ రావు అన్నారు. గజ్వేల్​కు రైల్వే స్టేషన్​ తెచ్చిన ఘనత కేసీఆర్​ దేనని చెప్పారు. ‘‘గజ్వేల్​ను రెవెన్యూ డివిజన్​చేసినం. అడువుల పునరుద్ధరణ చేసినం. ఈరోజు కూడెళ్లి, హల్దీ వాగులు నిండు కుండల్లా ప్రవహిస్తున్నాయంటే అది కేసీఆర్ ​ఘనతే.  ఇంత అభివృద్ధి చేసిన కేసీఆర్​ను భారీ మెజార్టీతో గెలిపించి రుణం తీర్చుకోవాలి” అని కార్యకర్తలకు ఆయన సూచించారు. గజ్వేల్​లో కేసీఆర్​.. రాష్ట్రంలో బీఆర్ఎస్​ హ్యాట్రిక్​ పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్​ డెవలప్​మెంట్ ​కార్పొరేషన్ ​చైర్మన్​ ఒంటేరు ప్రతాప్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.