బీఆర్ఎస్ పని ఖతమైంది : లక్ష్మణ్​

బీఆర్ఎస్ పని ఖతమైంది : లక్ష్మణ్​
  •      ఓఎల్ఎక్స్​లోనూ బీఆర్ఎస్​ను కొనేటోళ్లు లేరు 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో బీఆర్ఎస్​ పని ఖతమైందని, ఆ పార్టీని ఓఎల్ఎక్స్​లో పెట్టినా కొనేవాళ్లు లేరని బీజేపీ ఎంపీ లక్ష్మణ్​ అన్నారు. పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ లకు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.  బుధవారం  ఆ పార్టీ రాష్ర్ట కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. అభద్రతా భావంతో ప్రజలను కాంగ్రెస్ అయోమయానికి గురిచేస్తున్నదని అన్నారు. దేశానికి ప్రధాని ఎవరు కావాలనే అంశంలో మోదీవైపే ప్రజలు మొగ్గు  చూపుతున్నారని లక్ష్మణ్​ పేర్కొన్నారు.  

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ మీద వ్యతిరేకత తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఎంఐఎంను ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు లౌకికవాదం గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదమన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ).. ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్ నేతలు  తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎవరు మతతత్వ రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.  కేవలం ఓట్ల కోసం రాజకీయాలు చేసే వారిని ఓడించాలని మోదీ మాట్లాడితే.. దానిని రాజకీయం చేస్తున్నారని అన్నారు.