బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుండటంతో టైటిల్ విజేత ఎవరనే ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరైన సంజన ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 103వ రోజు ఎపిసోడ్‌లో భాగంగా సంజన 'బిగ్‌బాస్ జర్నీ'ని ఆవిష్కరించారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి చివరి వరకు తనదైన శైలిలో షోను రక్తికట్టించిన సంజన.. భావోద్వేగాల మేళవింపుగా సాగిన తన జర్నీ వీడియోను చూసి కన్నీటి పర్యంతమైంది.
కన్నీరు పెట్టించిన సంజన
గార్డెన్ ఏరియాలో తన జర్నీ జ్ఞాపకాలతో నిండిన గదిలోకి వెళ్లిన సంజన, అక్కడ తన కుమారుడు అలరిక్ ఫోటోను చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. "అలరిక్.. మమ్మీ ఇంట్లో లేదు సారీ నాన్న.. మమ్మీ అరగంటలో వస్తానని చెప్పింది.. కానీ వంద రోజులు దాటిపోయినా ఇంకా నీ దగ్గరకు రాలేకపోయాను.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టించాయి. ఒక తల్లిగా తన బిడ్డకు దూరంగా ఉంటూ, కేవలం లక్ష్యం కోసం ఆమె పడిన సంఘర్షణ ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.
డ్రామా క్వీన్ నుంచి టాప్-5 వరకు!
సంజన ఆట తీరు గురించి బిగ్‌బాస్ చేసిన విశ్లేషణ ఆమె వ్యక్తిత్వాన్ని అద్దం పట్టింది. సంజన.. టాప్ గేర్‌లో ఆట మొదలుపెట్టి టాప్-5కి చేరిన మీ ప్రయాణంలో బోలెడంత డ్రామా ఉంది. సీజన్-9కి మొదటి కెప్టెన్ గా నిలిచి ఆరంభం నుంచే షోని మీ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీ కోసం జరగాలి.. అది మీ ప్రత్యేకత అని బిగ్ బాస్ అన్నారు. హౌస్ లో సంజన చేసిన 'గుడ్డు దొంగతనం' టాస్క్ షో హిస్టరీలోనే హైలైట్‌గా నిలిచింది. రీతూ, డీమాన్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లతో ఆమె పెట్టుకున్న గొడవలు, చేసిన కామెంట్స్ ఒకానొక దశలో ఆమెను విలన్‌గా చిత్రీకరించినా.. అవే ఆమెను టాప్-5కి చేర్చాయి.
మొండి ధైర్యం.. అలుపెరుగని పోరాటం
టాస్కుల్లో పోటీ పడినా, సంచాలకురాలిగా వ్యవహరించినా సంజన ఉన్న చోట ఎప్పుడూ ఒక ఆసక్తి నెలకొనేది. ఎవరెన్ని విమర్శలు చేసినా, తను నమ్మిన మాట మీద నిలబడే మొండి ధైర్యం సంజన సొంతం. ఒక ఒంటరి పోరాటం చేసి ఇక్కడి వరకు వచ్చిన సంజనను చూసి, భవిష్యత్తులో ఆమె కుమారుడు అలరిక్ కచ్చితంగా గర్వపడతాడు అని బిగ్‌బాస్ అన్నారు.
టైటిల్ రేసులో సంజన నిలుస్తుందా?
ప్రారంభంలో ఎలిమినేషన్ అంచున ఉన్నట్లు అనిపించినా, తన అద్భుతమైన గేమ్ ప్లాన్‌తో సంజన టాప్-5లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. మహిళా కంటెస్టెంట్లలో గట్టి పోటీ ఇస్తున్న సంజన, ఈ ఆదివారం విజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తుందా? లేక రన్నరప్‌గా నిలుస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంజన జర్నీ చూసిన నెటిజన్లు "తల్లి మనసు.. మొండి ధైర్యం" అంటూ ఆమెను సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు.
