కేటీఆర్ విచారణ వేళ.. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన

కేటీఆర్ విచారణ వేళ.. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
  •     జూబ్లీహిల్స్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్​ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత

జూబ్లీహిల్స్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  సిట్  విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌‌‌కు రాగా.. ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్నది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేటీఆర్ విచారణ కొనసాగుతుండగానే, బయట బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. 

కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను హరీశ్​రావు  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు దింపి ముందుకు రాగా, అక్కడ ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు, కొప్పుల ఈశ్వర్, క్రాంతి కిరణ్, ఎమ్మెల్యే  వివేకానంద్ గౌడ్ తదితర ముఖ్య నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. హరీశ్‌‌‌‌రావు  వచ్చి వారిని పైకి లేపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌‌‌‌పై సిట్ విచారణను రాజకీయ ప్రేరిత చర్యగా అభివర్ణించారు. 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నమన్నారు. మరో వైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందుకు గుంపుగా ఓ పదిమంది మహిళా నాయకురాళ్లు ఒక్కసారిగా దూసుకురవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. వారందరినీ లేడీ కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకొని.. వాహనంలోకి ఎక్కించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు. సిట్ విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి కేటీఆర్ బయటకు రాగా.. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. పోలీసులు వారిని అదుపు చేసి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను అక్కడి నుంచి కారులో  భద్రత మధ్య పంపించారు.