బీజేపీ వల్లే దేశానికి ప్రమాదం: కేటీఆర్

బీజేపీ వల్లే దేశానికి ప్రమాదం: కేటీఆర్

ముషీరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి  అబద్ధాలకు అంబాసిడర్లుగా నిలిచారని బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  అన్నారు. ఆ ఇద్దరూ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సికింద్రాబాద్  బీఆర్ఎస్  అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా బీఆర్ఎస్  మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ముషీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సభకు కేటీఆర్  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో భయపెట్టి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. 

అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని చెప్పారు. తాము మోదీకి లొంగనందుకే తమ చెల్లె కవితపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఫైర్  అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం బీజేపీతో కుమ్మక్కయ్యారని, ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలో చేరుతారని కమలం పార్టీ నేతలే  చెబుతున్నారని కేటీఆర్  పేర్కొన్నారు. దేశంలో హిందువులు ప్రమాదంలో లేరని, బీజేపీ వల్లే హిందుస్తాన్  ప్రమాదంలో ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తమకు 10 నుంచి 12 ఎంపీ సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్  రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని చెప్పారు.