
- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ట్యాక్స్ పేయర్లకు ఎగ్గొట్టారు : కేటీఆర్
హైదరాబాద్, వెలుగు : రుణమాఫీ ఒక బోగస్ అని, రాష్ట్రంలో రైతులకు జరిగిన అతి పెద్ద మోసమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కనీసం సగం మందికి కూడా మాఫీ కాలేదన్నారు. రుణమాఫీ చేయడంలో విఫలమైనందునే సీఎం రేవంత్ ఫ్రస్ట్రేషన్‌లో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మన్నా తాను వస్తానని.. కనీసం ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు రైతులు చెప్తే..
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలు వదిలేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. ఏ ఊరికి అనేది రేవంతే నిర్ణయించుకోవాలన్నారు. ఆ ఊరికి తాను సెక్యూరిటీ లేకుండా వస్తానని, సీఎం కూడా సెక్యూరిటీ లేకుండా రావాలన్నారు. మీడియా సమక్షంలో రైతులను రుణమాఫీ గురించి అడుగుదామన్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ట్యాక్స్ పేయర్లకు రుణమాఫీ ఎగ్గొట్టారని ఆయన ఆరోపించారు.
సీఎం కటింగ్ మాస్టర్‌గా మారి కోతలు పెట్టారని దుయ్యబట్టారు. రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసి, రూ.11,400 కోట్ల రైతుబంధును ఎగ్గొట్టారని విమర్శించారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో 41 శాతం, డిప్యుటీ సీఎం జిల్లా ఖమ్మంలో 30 శాతం మందికే రుణమాఫీ అయిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తంగా 46 శాతం మందికే రుణమాఫీ అయిందన్నారు.
సీఎం మానసిక స్థితి సరిగా లేదు
సీఎం రేవంత్‌రెడ్డి మానసిక స్థితిపై తనకు అనుమానాలు ఉన్నాయని, కుటుంబ సభ్యులు అతన్ని డాక్టర్‌కు చూపించాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. లేకుంటే రాష్ట్రం పిచ్చోని చేతిలో రాయి అవుతుందన్నారు. కొండల్ రెడ్డి(సీఎం సోదరుడు) ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైందని, రేవంత్ అమెరికా పర్యటన ఫెయిలైందని విమర్శించారు. ఆ ఇద్దరు అక్కడుంటే, ఇక్కడ తిరుపతిరెడ్డి హల్‌చల్ చేసిండని విమర్శించారు.