- నిందితులను కాపాడేందుకు పోలీసులకు సిగ్గుండాలి: కేటీఆర్
- బాధిత కుటుంబానికి కోటి పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
- ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అసెంబ్లీలో నిలదీస్తామని కామెంట్
- కుమ్మెర బాధిత కుటుంబానికి పరామర్శ
నాగర్‌కర్నూల్, వెలుగు: అహంకారంతో రెండునెలల పాపను కాలితో తన్ని చావుకు కారణమైన వారిని హత్యానేరం కింద శిక్షించాలని, అంతవరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కేసులో నాగర్ కర్నూలు పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
నిందితులు ఎవరైనా.. ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా చర్యలు తీసుకోకపోతే శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా శిబిరంలో కుమ్మెర బాధితులు గణేష్, మౌనిక దంపతులను, వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. గణేష్‌కు తక్షణసాయంగా రూ. లక్ష అందించారు. రూ.10 లక్షలతో పార్టీ తరఫున ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా రూ. కోటి పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులం పేరిట దాడి చేసి పసిపిల్ల చావుకు కారణమైన మానవమృగాలకు శిక్షపడాలని, బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు అంబేద్కర్ సాక్షిగా రోడ్డుమీదకు రావడం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భమని అన్నారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించి గణేష్ కుటుంబానికి అండగా నిలిచిన విశారదన్ మహారాజ్, మందకృష్ణ మాదిగ, బీఎస్పీ, ఎస్టీ, ఎస్టీ, బీసీ ప్రజాసంఘాల నాయకులకు కేటీఆర్కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యాంగాన్ని, హక్కులను ఖననం చేశారు..
రెండు నెలల చిన్నారికి పాలివ్వాల్సిన తల్లి మౌనిక ఇవాళ కన్నీళ్లతో రోడ్డుమీద కూర్చున్నదని, చంపింది పసిగుడ్డునే కాదు..రాజ్యాంగాన్నీ, హక్కులను కూడా ఖననం చేశారని కేటీఆర్ అన్నారు. ‘‘రెండు నెలల చిన్నారి ఏం అడిగింది? దైవదర్శనమే కానీ అధికార పదవులు.. మీరు కూడబెట్టిన ముల్లెలు కాదుకదా? గణేష్ మీద 25 మంది కలిసి దాడి చేస్తుంటే కనీసం పసిపిల్ల ముఖం చూసి వదిలిపెట్టాలని మౌనిక ప్రాధేయపడితే మానవ మృగాలకంటే హీనంగా పాపను కాలితో తన్నారు” అని ఫైర్ అయ్యారు. నాగర్ కర్నూల్ పోలీసులకు గణేష్ దంపతులు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని, సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులకు ఫోన్‌చేసి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వాలని సలహా ఇచ్చారని ఆరోపించారు. హత్యకేసు పెట్టి జైలుకు పంపించాల్సిన నిందితులను ఎవరు కాపాడుతున్నారు? అని నిలదీశారు. ఏపార్టీకి చెందినవారైనా వారు హంతకులేనని, ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
