ఈ వారంలోనే రిలయన్స్ బ్రూక్‌‌ఫీల్డ్ డేటా సెంటర్‌‌ ప్రారంభం..ప్రకటించిన ముకేశ్​ అంబానీ

 ఈ వారంలోనే రిలయన్స్ బ్రూక్‌‌ఫీల్డ్ డేటా సెంటర్‌‌ ప్రారంభం..ప్రకటించిన ముకేశ్​ అంబానీ

 చెన్నై:   కెనడాకు చెందిన బ్రూక్‌‌ఫీల్డ్‌‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన డేటా సెంటర్​ను ఈవారం చెన్నైలో ప్రారంభిస్తామని  రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్​ ముకేశ్​ అంబానీ ప్రకటించారు.   బ్రూక్‌‌ఫీల్డ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్​తోపాటు  యూఎస్ ఆధారిత రియల్​ ఎస్టేట్ ఇన్వెస్ట్‌‌మెంట్ ట్రస్ట్ డిజిటల్ రియాల్టీ  భాగస్వాములుగా ఉన్న జాయింట్ వెంచర్‌‌లోకి  రిలయన్స్ గత ఏడాది జులైలో ప్రవేశించింది. 

ఇందులో వాటా కోసం సుమారు రూ. 378 కోట్లు పెట్టుబడి పెట్టింది. వెంచర్‌‌లో ముగ్గురికి 33 శాతం చొప్పున వాటా ఉంది. చెన్నైలో జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌‌లో  అంబానీ మాట్లాడుతూ, తమ గ్రూప్ రెన్యువబుల్​ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌‌తో పాటు రాష్ట్రంలో డేటా సెంటర్‌‌ను ఏర్పాటు చేయడానికి పెట్టుబడులు పెడుతుందని చెప్పారు.  డేటా సెంటర్​ మార్కెట్​ సంవత్సరానికి 40 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. 

2025 నాటికి ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.  
గౌతమ్ అదానీ  అదానీ గ్రూప్,  సునీల్ మిట్టల్  భారతీ ఎయిర్‌‌టెల్ లిమిటెడ్‌‌కు ప్రత్యర్థి అయిన రిలయన్స్ ప్రవేశంతో భారతీయ డేటా సెంటర్ల మార్కెట్ వేడెక్కుతోంది. రిలయన్స్​ జాయింట్ వెంచర్ వచ్చే వారం చెన్నైలో 20 మెగావాట్ల గ్రీన్‌‌ఫీల్డ్ డేటా సెంటర్‌‌ను ప్రారంభించనుంది.  మరో 40-మెగావాట్ల డేటా సెంటర్‌‌ను నిర్మించడానికి ముంబైలో 2.15 ఎకరాల భూమిని కూడా సేకరించింది. 

తమిళనాడులో మరిన్ని పెట్టుబడులు

తమిళనాడు అద్భుత సంస్కృతికి నెలవన్న అంబానీ, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా మారిందని అన్నారు. ఈ రాష్ట్రం త్వరలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. కొన్నేళ్లుగా తమిళనాడు వృద్ధిలో రిలయన్స్ భాగస్వామిగా ఉందన్నారు. ‘‘రూ.25వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,300 రిటైల్ స్టోర్లను ప్రారంభించాం. మా గ్రూప్  టెలికాం విభాగం అయిన జియో తమిళనాడులో రూ. 35వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. రాష్ట్రంలోని ప్రతి పట్టణం,  గ్రామంలో 3.5 కోట్ల మందికి డిజిటల్ ప్రయోజనాలను అందించింది.   తమిళనాడులో రెన్యువబుల్​ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌‌లో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ కట్టుబడి ఉంది”అని అంబానీ చెప్పారు.