
ఝార్సుగూడ (ఒడిశా): కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) స్వదేశీ 4జీ నెట్ వర్క్ ఏర్పాటుతో కొత్త అవతారం ఎత్తిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియా ఇక టెలికం పరికరాల తయారీలో గ్లోబల్ హబ్‌గా నిలుస్తుందని ఆకాంక్షించారు. బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన 97,500 మొబైల్ 4జీ టవర్లను శనివారం ఒడిశాలోని ఝార్సుగూడ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెలికం సేవల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న బీఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడు స్వదేశీ 4జీ నెట్ వర్క్ ఏర్పాటుతో కొత్త అవతారం ఎత్తినట్టయిందన్నారు. దేశవ్యాప్తంగా 97,500 4జీ టవర్లను రూ. 37 వేల కోట్లతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెట్ వర్క్‌తో మారుమూల ప్రాంతాల్లోని 30 వేల గ్రామాల్లో ఉంటున్న 2 కోట్ల మందికి హైస్పీడ్ ఇంటర్నెట్, మొబైల్ సేవలు అందుతాయన్నారు. ఈ 4జీ టవర్లను సులభంగానే 5జీ టవర్లుగా కూడా మార్చుకోవచ్చని ప్రధాని తెలిపారు.
అలాగే వీటి నిర్వహణకు పూర్తిగా సోలార్ పవర్ నే వినియోగించేలా ఏర్పాట్లు జరిగాయన్నారు. ఇప్పటివరకూ విదేశాల టెక్నాలజీతోనే మన దేశంలో 2జీ, 3జీ, 4జీ నెట్ వర్క్ ల ఏర్పాటు జరిగిందని.. కానీ బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే 4జీ టవర్లను అందుబాటులోకి తెచ్చామని ప్రధాని మోదీ తెలిపారు.
దీంతో టెలికం పరికరాల తయారీలో డెన్మార్క్, స్వీడన్, సౌత్ కొరియా, చైనా వంటి అతికొద్ది దేశాల సరసన ఇండియా నిలిచిందన్నారు. ఇకపై టెలికం పరికరాల తయారీలో ఇండియా గ్లోబల్ హబ్ గా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, సీఎం మోహన్ చరణ్ మాఝీ, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వర్చువల్‌గా హాజరయ్యారు.
రూ. 50 వేల కోట్ల ప్రాజెక్టులు..
టెలికంతోపాటు రైల్వేస్, ఉన్నత విద్య, హెల్త్ కేర్, స్కిల్ డెవలప్ మెంట్, హౌసింగ్ రంగాలకు సంబంధించిన మొత్తం రూ. 50 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ఒడిశా నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
కాంగ్రెస్ ఎవర్నీ వదలకుండా లూటీ చేసింది..
దేశ ప్రజల్లో ఏ వర్గాన్నీ వదలకుండా కాంగ్రెస్ లూటీ చేసిందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగిన ‘నమో యువ సమాబేశ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ రేషనలైజేషన్ ద్వారా బీజేపీ సర్కారు.. ప్రజలకు రెట్టింపు ఆదా, రెట్టింపు ఆదాయం వచ్చేలా చూసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏడాదికి రూ. 2 లక్షలు సంపాదించిన వాళ్లపైనా ట్యాక్స్‌లు వేశారని, తాము రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చామన్నారు.