నేరెళ్ల బాధితులకు అండగా ఉంటాం

నేరెళ్ల బాధితులకు అండగా ఉంటాం

తంగళ్లపల్లి/సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: మంత్రి కేటీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో బహుజనులకు రక్షణ లేకుండా పోయిందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ​కోఆర్డినేటర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా నేరెళ్ల ఘటన బాధితులను ఆయన పరామర్శించారు. సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి పాటుపడాల్సిన మంత్రి కేటీఆర్​ఇక్కడి సంపదను బయటకు తరలిస్తున్నాడని దుయ్యబట్టారు. ఇసుక లారీలతో సామాన్య ప్రజల ప్రాణాలు పోతున్నా మంత్రికి పట్టడం లేదన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రగల్భాలు పలికే సీఎం కేసీఆర్​కు నేరెళ్ల బాధితుల దీన పరిస్థితి కనబడడం లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్​ అనడం సిగ్గుచేటని, అదే రాజ్యాంగం లేకుంటే నేరెళ్ల బాధితుల పరిస్థితేంటని అన్నారు. సిరిసిల్లలో టీఆర్ఎస్​లీడర్లు, పెత్తందారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేవరకు వారికి అండగా ఉంటామన్నారు. రాష్ట్రపతి అపాయింట్​మెంట్​తీసుకొని నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. 

మార్చి 6 నుంచి బహుజన యాత్ర
తెలంగాణలో గడీల కోటలను బద్దలు కొడతామని, బహుజన రాజ్యాన్ని స్థాపిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన  బీఎస్పీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు లేరన్నారు. అన్ని డిపార్ట్ మెంట్ లలో ఖాళీలు వెక్కిరిస్తుంటే కేసీఆర్ మాత్రం ఇంటికో బర్రె, గొర్రెను ఇచ్చే ఆలోచన చేయడం దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో 3.77లక్షల యువతకు ఉద్యోగాలివ్వాలన్నారు. రాష్ట్రంలో బీఎస్పీని ఆధికారంలోకి తీసుకురావడానికి మార్చి 6 నుంచి బహుజన యాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. 300 రోజులు యాత్ర కొనసాగుతుందని, రాష్ట్రంలోని ప్రతి గడపను టచ్​చేస్తామన్నారు. అంతకుముందు తంగళ్లపల్లి నుంచి సాయిమణికంఠ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ తీశారు.