
- మా నాయకులు తప్పు చేస్తే నేనే మానేరులో వేస్త
- బీసీలకు అత్యధిక టికెట్లు ఇచ్చింది బీఎస్పీయే అని వ్యాఖ్య
రాజన్న సిరిసిల్ల, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే సీఎం కేసీఆర్ ను గుంజుకుపోయి జైల్లో పెడతామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపిస్తామని, గడీల పాలనను అంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్లలో నిర్వహించిన బీఎస్పీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల చరిత్రలో ఇప్పటి వరకు బీసీకి టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవని, తాము మాత్రం సిరిసిల్ల నుంచి ముదిరాజ్ బిడ్డ, ప్రముఖ న్యాయవాది పిట్టల భూమేశ్ కు టికెట్ ఇచ్చామని తెలిపారు.
బీఎస్పీ 63 మంది జాబితా విడుదల చేస్తే అందులో 23 సీట్లు బీసీలకే కేటాయించామన్నారు. బీసీలకు అత్యధిక టికెట్లు ఇచ్చింది తమ పార్టీయే అని చెప్పారు. తమ పార్టీ గెలిచాక తాను తప్పు చేస్తే కాల్చి చంపాలని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ అభ్యర్థులు గెలిచాక తప్పు చేస్తే వారిని తానే మానేరు డ్యాంలో వేస్తానని అన్నారు. మేడిగడ్డ కుంగడంతో కాళేశ్వరం కట్టడం నాణ్యత తేటతెల్లం అయ్యిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ రూ.1.15 లక్షల కోట్లు దోచుకుంది. బహుజన రాజ్యం ఏర్పడ్డాక ఆ డబ్బులను కక్కిస్తం. మళ్లీ బీఆర్ఎస్ కు ఓటేసి మోసపోవద్దు. బీఎస్పీని గెలిపిస్తే బహుజన తెలంగాణ నిర్మిస్తం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు సిరిసిల్లలో బీసీకి టికెట్ ఇస్తామని చెప్పారు. కానీ, కిషన్ మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక నాల్ లోకల్ వారికి టికెట్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కు బీసీలపై చిత్తశుద్ధి లేదు” అని ఆర్ఎస్ విమర్శించారు. సిరిసిల్లలో బీఎస్పీ మీటింగ్ ను మంత్రి కేటీఆర్ అధికారులతో కుట్రపన్ని అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు.
దేవుళ్లకే శఠగోపం పెట్టే నాయకుడు కేసీఆర్
వేములవాడ రాజన్న దేవుని సొమ్మును కామారెడ్డికి తరలించిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.వంద కోట్లు, కొండగట్టు అంజన్నకు ఇస్తానన్న రూ.500 కోట్ల హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. దేవుళ్లకే శఠగోపం పెట్టే నాయకుడు కేసీఆర్ అని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ముదిరాజ్ బిడ్డ ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ రూ.500 కోట్లు ఖర్చుపెట్టారని మండిపడ్డారు. కానీ, బీసీలు ఏకమై కేసీఆర్ ను ఓడించారని గుర్తుచేశారు. బీసీల రాజ్యం రావాలంటే బీఎస్పీని గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ సిరిసిల్ల, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థులు పిట్టల భూమేశ్, గోలి మోహన్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వర్థవెల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.