మానకొండూరులో నీలిజెండా ఎగరేస్తాం

మానకొండూరులో నీలిజెండా ఎగరేస్తాం

మానకొండూర్, వెలుగు: సీఎం కేసీఆర్​తమ సహనాన్ని పరీక్షించొద్దని, సహనం కోల్పోతే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆపడం మీ తరం కాదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​అన్నారు. కరీంనగర్​జిల్లా మానకొండూర్ కేంద్రంలో బీఎస్పీ జెండాను కూల్చిన టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మానకొండూరు నియోజకవర్గంలో 147వ రోజు ఆదివారం బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవీణ్​కుమార్​అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ జెండా గద్దెను కూల్చిన వారిపై కేసు పెట్టినా ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కూల్చిన జెండాను తిరిగి నిర్మిస్తుంటే పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు.

తాము శాంతియుతంగా యాత్ర చేపడుతుంటే  నియోజకవర్గంలో మూడుచోట్ల అకారణంగా జెండా గద్దెలు కూల్చారని, ఇలాగే కొనసాగితే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజలకు ఇళ్లు లేవని, పేదల అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని, రోడ్డు సౌకర్యాలు లేవని, స్కూళ్లలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోపక్క పాలకులు ఇసుక దందా చేస్తూ, ఫాం హౌస్ లు కట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రశ్నించినవారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే కాలంలో పేదలందరి బతుకులు మార్చడం కోసం మానకొండూరులో నీలిజెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రాంచంద్రం, రాష్ట్ర సభ్యులు జక్కని సంజయ్, రాష్ట్ర మహిళా నాయకురాలు శిరీష తదితరులు పాల్గొన్నారు.