సీపీఎం నేతలకు కేసీఆర్ దోపిడీ కనిపించడం లేదా?

సీపీఎం నేతలకు కేసీఆర్ దోపిడీ కనిపించడం లేదా?

సిద్ధిపేట: రాజ్యాంగాన్ని మార్చే దమ్మున్నోడు ఇంకా పుట్టలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సిద్ధిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీఎస్పీలో చేరారు.  పార్టీ కండువాలు కప్పిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్, నలుగురి మహిళల చావుకు కారణమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు బుద్ధి చెప్పడానికి చాలా మంది బీఎస్పీలో చేరుతున్నారని చెప్పారు. ఇంకోసారి ఎవరైనా భారత రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఐదో స్వతంత్ర పోరాటం మొదలైందని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

 

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పేముందన్న సీపీఎం అగ్రనేత సీతారం ఏచూరిపై ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సీపీఎం 17 మంది పోలిట్ బ్యూరో సభ్యుల్లో బీసీ, ఎస్టీ వర్గాల నుంచి ఎందుకు ఒక్కిరి కంటే ఎక్కువ మందిలేరని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు దేశాన్ని దోచుకుంటున్నారని చెప్పే సీపీఎం నేతలకు రాష్ట్రంలో కేసీఆర్ దోపిడీ కనిపించడం లేదా అని నిలదీశారు. దొరల వందల ఎకరాల్లో జెండాలు పాతే దమ్ముందా అని ఏచూరికి సవాలు విసిరారు.