పోడు రైతులపై ప్రభుత్వ విధానాలు నిరంకుశంగా ఉన్నాయి

పోడు రైతులపై ప్రభుత్వ విధానాలు నిరంకుశంగా ఉన్నాయి

పోడు రైతులపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నిరంకుశంగా ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడలో ఆయన  పర్యటించారు. పోడు భూముల హక్కుల కోసం పోరాడుతున్న మహిళలను ఆయన పరామార్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోయపోషగూడ ప్రజలు కేసీఆర్ లాగా ఫామ్ హౌజులు కట్టుకున్నారా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా అని ప్రశ్నించారు. బుక్కెడు బువ్వకోసం వారు పడే తాపత్రయం మీకు, మీ అధికారులకు కన్పించలేదా అని మండిపడ్డారు. దొరల గడీల పాలన అంతం చేసే రోజు దగ్గర్లోనే ఉందని..తెలంగాణ మీ కుటుంబానికి కాదని..రాష్ట్ర ప్రజలందరిదని వ్యాఖ్యానించారు.

కాగా కొన్ని రోజుల క్రితం వానాకాలం సాగు కోసం పోడుభూముల్లో తుప్పలు తొలగించేందుకు వెళ్లిన కోయపోషగూడానికి చెందిన 12 మంది గిరిజన మహిళలపై ఫారెస్టు ఆఫీసర్లు కేసులుపెట్టి జైలుకు పంపారు. గిరిజనులు అటవీ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని ఫారెస్ట్​ ఆఫీసర్లు మహిళలను అరెస్ట్ ​చేశారు. కోయపోషగూడ గిరిజనులు 20 ఏండ్లుగా పోడు భూములపై హక్కుల కోసం పోరాడుతున్నారు. తండా శివారులోని అటవీ భూముల్లో తుప్పలు సాఫ్​చేసి పంటలు వేసుకుంటే ఫారెస్టోళ్లు ట్రాక్టర్లతో వచ్చి ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల మళ్లీ గిరిజనులు పోడు భూములను సాగు చేసుకునే క్రమంలో తుప్పలు, చెట్ల పొదలను తొలగించారు. అయితే ఫారెస్ట్ అధికారులు వారిని అరెస్ట్ చేశారు.