
బీటీ పంటల గొడవ మళ్లీ మొదలైంది. బీటీ పత్తి, బీటీ వంకాయలు పండించటాన్ని మహారాష్ట్ర సర్కారు నాలుగేళ్ల క్రితమే నిషేధించింది. అయినా వాటి సాగు పట్ల రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అదే తాజా వివాదానికి కారణమైంది. బీటీ వెరైటీలతో ఎవరికీ ఎలాంటి నష్టమూ లేకపోగా వ్యవసాయానికి, రైతులకు ప్లస్ అవుతోందనే వాదన తిరిగి తెరపైకి వచ్చింది. బీటీ పంటల సాగుకి ఒకపక్క అనుమతించకుండా, ఆయా ప్రొడక్ట్‌ల దిగుమతికి అనుమతించడమేమిటని ‘షేట్కారి సంఘటన్’ నిలదీస్తోంది.
బీటీ పంటలను బ్యాన్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందట తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు వ్యతిరేకత మొదలైంది. రైతులు పెద్ద సంఖ్యలో తప్పుపడుతున్నారు. విదర్భలోని అకోలా జిల్లా అకోలీ జహంగీర్ గ్రామంలో వెయ్యి మందికి పైగా రైతులు బీటీ పత్తి విత్తనాలు నాటారు. ఈ నిరసన కార్యక్రమం షేట్కారి సంఘటన్ అనే రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. తమకు వ్యతిరేకంగా జరిగిన ఈ వ్యవహారంపై ఫడ్నవీస్ ప్రభుత్వం స్పందించకపోవటం చర్చనీయాంశమైంది. హర్యానాలో ఇల్లీగల్‌గా సాగుచేస్తున్న బీటీ వంకాయపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కఠినంగా వ్యవహరించింది. పంట మొక్కలను పీకేసి, నేలమట్టం చేసింది.
జన్యుపరంగా అభివృద్ధి పరిచిన (జెనెటికల్లీ మోడిఫైడ్–జీఎం) విత్తనాలతో రైతులకు లాభమే తప్ప నష్టం లేదనేది షేట్కారీ సంఘటన్ వాదన. అనేక ప్రయోజనాలున్న ఈ గింజలను వివిధ దేశాల్లో వాడుతుంటే మనమెందుకు వ్యతిరేకించాలని ప్రశ్నిస్తోంది. విత్తనాల రేటు తక్కువని; పురుగులు, కీటకాల బెడద పెద్దగా ఉండదని, దిగుబడి అధికంగా వస్తుందని వివరిస్తోంది.
హర్యానా తర్వాత మరో రాష్ట్రంలో బీటీ సానుకూల ఆందోళన ప్రారంభమైంది. బీటీ పత్తిని మహారాష్ట్ర తొలిసారిగా 2012లో బ్యాన్ చేసింది. తర్వాత ఏడాదికే (2013లో) నిషేధం ఎత్తేసి… 2015లో మళ్లీ అమల్లోకి తెచ్చింది. బీటీ వంకాయ సాగుకు 2010లో అప్పటి కేంద్ర పర్యావరణ మంత్రి జైరామ్ రమేశ్ తెర దించారు. ఈ పంట పండించాలా వద్దా అనే దానిపై రైతులు, సైంటిస్టులు ఏకాభిప్రాయానికి రాకపోవటంతో బీటీ వంకాయ సాగుకి విరామం (మారటోరియం) ప్రకటించారు.
జీఎం పంటలతో ఎన్విరాన్మెంట్కి, బయోడైవర్సిటీకి హాని కలుగుతుందని యాంటీ–జీఎం గ్రూపులు వాదిస్తున్నాయి. ఆ పంటల ఉత్పత్తులను వాడితే ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమని చెబుతున్నాయి. కానీ యాంటీ–జీఎం గ్రూపులు చేస్తున్న వాదనలు శుద్ధ అబద్ధమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. నేషనల్ సైన్సెస్ అకాడమీల ఆధ్వర్యంలో ఈ పంటలపై 900 స్టడీలు జరిగాయి. ఇవన్నీకూడా జీఎం పంటల వల్ల ఎలాంటి నష్టం లేదని 2016లోనే తేల్చేశాయి. బీటీ వెరైటీలు వాతావరణంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపట్లేదని, వ్యవసాయానికి ప్లస్‌గా మారాయని వివరించాయి.
‘సంఘటన్’కి శరద్ జోషి శ్రీకారం
జీఎం పంటలకు కెనడా, అమెరికా 1996లోనే పర్మిషన్ ఇచ్చాయి. ఈ ఇన్స్పిరేషన్తో షేట్కారీ సంఘటన్‌ను రైతు నేత శరద్ జోషి స్థాపించారు. వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం తగ్గించటానికి కృషి చేశారు. ఫ్రీ మార్కెట్లతో చివరికి రైతులకే లాభమనే వాదనను తెరపైకి తెచ్చారు. బీటీ కాటన్ వాడటానికి రైతులకు అనుమతి ఇవ్వాలని 2001 నుంచి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలా దేశాల్లో జీఎం పంటలను సాగు చేస్తున్నారు. జీఎం సీడ్స్‌తో 1996లో 17 లక్షల హెక్టార్లు సాగు చేయగా… 20 ఏళ్లలో (2016 నాటికి) 18.51 కోట్ల హెక్టార్లకు సేద్య విస్తీర్ణం పెరిగింది.
బీటీ పంటలను పండించటానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవటంతో రైతులు అక్రమంగా సాగు చేయటం మొదలు పెట్టారని షేట్కారీ సంఘటన్ ఆరోపిస్తోంది. విత్తనాలను స్మగ్లింగ్ ద్వారా సేకరించి దేశవ్యాప్తంగా రైతులు ఈ పంటలను పండిస్తున్నారని, నిషేధం పేరుకే పరిమితమైందని విమర్శిస్తోంది. తమ ఉద్యమాన్ని రాష్ట్రమంతటికీ విస్తరింపజేయటానికి ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఖరీఫ్ సీజన్లో మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో ఈ విత్తనాలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.