ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బుద్ధవనం : మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బుద్ధవనం : మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     బౌద్ధ దేశాల రాయబారులతో మంత్రి జూపల్లి మీటింగ్  

హైదరాబాద్, వెలుగు:  నాగార్జున సాగర్‌‌లో నిర్మిస్తున్న బుద్ధవనం బౌద్ధ హెరిటేజ్ థీమ్ పార్క్ ను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్‌‌లో ఆదివారం ఆసియా, బౌద్ధ దేశాల రాయబారులు, హైకమిషనర్లతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ బౌద్ధ వారసత్వం, అంతర్జాతీయ పర్యాటక–సాంస్కృతిక భాగస్వామ్యాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో మహాయాన బౌద్ధానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉందని.. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని అన్నారు. నాగార్జునకొండ, ఫణిగిరి, ధూలికట్ట, నేలకొండపల్లి, కోటిలింగాల వంటి బౌద్ధ కేంద్రాల ప్రాముఖ్యతను వివరించారు. బుద్ధుడి జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుందన్నారు. 

సర్వజన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనంతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుడి మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాల పునరుద్ధరణకు ప్రభుత్వం చేస్తున్న కృషిని రాయబారులు అభినందించారు. భవిష్యత్‌‌లో సాంస్కృతిక, పర్యాటక, పెట్టుబడి రంగాలలో సహకారం అందజేస్తామన్నారు. 

సమావేశంలో వివిధ దేశాల రాయబారులు నజ్వా బింటి జైనాల్, డా. శంకర్ ప్రసాద్ శర్మ( నేపాల్), కల్పనా శర్మ, మేజర్ జనరల్ వెట్సాప్ నామ్‌‌గయెల్(భూటాన్), డా జామ్, ఛవనార్ట్ థాంగ్‌‌సుంఫంట్(థాయ్‌‌లాండ్), క్లిమెంటే కమేం(అంగోలా), ఎరిక్ జాన్ ఎం. జిన్సూ(బెనిన్).. హైకమిషనర్లు మహిషిని కొలోన్, కార్యదర్శి రూచీ సింగ్ ( శ్రీలంక), ముజాఫర్ షా బిన్ ముస్తఫా(మలేషియా), హారిసోవా అకూష్( సీషెల్స్),  ఎడ్ జాగర్, లినా సోవాని( కెనడా), తదిరులు  పాల్గొన్నారు.