బోధన్, వెలుగు : ఎన్నికల్లో విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియలో పీవోలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. సాలూర మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు ఆదివారం మలి విడత శిక్షణా తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు అధికారులు చేరుకోవాలని సూచించారు. మొదటి విడత పోలింగ్ ఈనెల 11న జరుగనున్న సందర్భంగా 10న ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. చెక్ లిస్ట్‌కు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు.
సీటింగ్ అరెంజ్మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటరు ఓటు వేయవచ్చని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క బ్యాలెట్ పత్రం కూడా బయటకు వెళ్లకూడదన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకుడు జీవీ శ్యాంప్రసాద్ లాల్ అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, స్టేజ్ -–2 రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
