- విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ కుంగ్‌ఫూ చాంపియన్‌షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ ప్రాంతం క్రీడాకారులకు నిలయమన్నారు. గతంలో ఇక్కడి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. కరాటే, కుంగ్‌ఫూ పోటీలు జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొనే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, దానిలో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యాలు వెలికి తీసేందుకు సీఎం కప్ లాంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రాండ్‌మాస్టర్ వీరాచారి, హామీద్, చాఫ్ ఆర్గనైజర్ నేరేళ్ల శ్రీధర్‌గౌడ్, వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు
కుంగ్ ఫూ పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లా నుంచి స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ ఆఫ్ సిరిసిల్ల మాస్టర్ వడ్నాల అన్నపూర్ణ ఆధ్వర్యంలో 20 మంది విద్యార్థులు పాల్గొని పతకాలు కైవసం చేసుకున్నారు. బ్రౌన్ బెల్ట్ ఫైట్ విభాగంలో గౌతమ్ ఆనంద్ ప్రథమ బహుమతి గోల్డ్ మెడల్, సబ్ జూనియర్ విభాగంలో గౌతమ్ గౌరవ్, కూన సదంజన్ గోల్డ్ మెడల్ సాధించారు.
కలర్ బెల్ట్స్ కటా విభాగంలో కూన వైష్ణవి, గుగ్గిళ్ల రుత్విక, మురళీకృష్ణ గోల్డ్ మెడల్ సాధించారు. రెహాన్, లింగం రుథ్వీసా, శివన్స్, అక్షర , అక్షయ సిల్వర్ మెడల్స్, వర్షిత్, వేదాన్ష్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
