అగ్రి రుణాల టార్గెట్​ రూ.20 లక్షల కోట్లకు పెంపు

అగ్రి రుణాల టార్గెట్​ రూ.20 లక్షల కోట్లకు పెంపు
  • గతేడాదితో పోలిస్తే 11 శాతం పెంచిన కేంద్రం
  • ఫిషరీ మార్కెట్ విస్తరణకు రూ. 6 వేల కోట్లతో పీఎం మత్స్య సంపద యోజన
  • ప్రకృతి వ్యవసాయం చేసేందుకు కోటి మంది రైతులకు సాయం
  • ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహానికి స్టేట్స్ కు ప్రణామ్ కింద ఇన్సెంటివ్స్

న్యూఢిల్లీ: వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని కేంద్రం 11 శాతం పెంచింది. పశుపోషణ, డైరీ, ఫిషరీస్ తదితరాలపై ఫోకస్ పెడుతూ అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్‌‌‌‌ను రూ.20 లక్షల కోట్లుగా నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో 18 లక్షల కోట్లను టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ఏటా క్రెడిట్ టార్గెట్‌‌‌‌ను పెంచుతున్న ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫిషరీ మార్కెట్‌‌‌‌ను విస్తరించేందుకు రూ.6 వేల కోట్లతో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను ప్రారంభించనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించేందుకు.. రొయ్యల మేత దేశీయ తయారీకి కీలకమైన వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించ నున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసేం దుకు దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు కేంద్రం సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. జాతీయ స్థాయిలో సూక్ష్మ ఎరువులు, పురుగుల మందుల తయారీ నెట్​వర్క్​ను రూపొందించడానికి 10,000 బయో-ఇన్‌‌‌‌పుట్ రీసోర్స్ సెంటర్లు, పంట​ స్టోరేజీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రత్యామ్నా య ఎరువుల వినియోగం, అవసరాన్ని బట్టి రసాయన ఎరువులు వినియోగించేలా ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్, అవేర్‌‌‌‌‌‌‌‌నెస్, నౌరిష్‌‌‌‌మెంట్, అమెలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ (పీఎం ప్రణామ్) స్కీమ్ కింద రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారు. అధిక విలువ కలిగిన ఉద్యాన పంటలకు.. వ్యాధులు సోకని, నాణ్యమైన మొక్కలు నాటే మెటీరియల్‌‌‌‌ లభ్యతను పెంచడానికి రూ.2,200 కోట్లతో ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్’ ప్రోగ్రాం ప్రారంభించనుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువ ఎంట్రప్రెన్యూవర్ల స్టార్టప్స్‌‌‌‌లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

గ్లోబల్​ మిల్లెట్స్​ హబ్​గా ఐఐఎంఆర్​ హైదరాబాద్

శ్రీ అన్న (మిల్లెట్స్) కు గ్లోబల్ హబ్‌‌‌‌గా ఇండియాను తీర్చిదిద్దేందుకు.. హైదరాబాద్‌‌‌‌లోని ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ను.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌గా ప్రకటించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రాక్టీస్‌‌‌‌లు, రీసెర్చ్​లు, టెక్నాలజీలను పంచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్స్ ఉత్పత్తిదారు.. రెండో అతిపెద్ద ఎగుమతిదారు ఇండియా. జొన్నలు, రాగి, సజ్జలు, కుట్టు, రామదాన, కంగ్నీ, కుట్కి, కోడో, చీనా, సామ వంటి అనేక రకాల మిల్లెట్స్‌‌‌‌ను పండిస్తున్నది. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాలుగా మన ఆహారంలో భాగమయ్యాయి. ‘శ్రీ అన్న’ను పెంచడం ద్వారా పౌరుల ఆరోగ్యానికి తోడ్పడటంలో చిన్న రైతులు చేస్తున్న అపారమైన సేవను సగర్వంగా తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు.