యువతకు ‘ట్రిపుల్’ బూస్ట్ బొనాంజా: హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్స్ పై భారీ ఫోకస్..

యువతకు ‘ట్రిపుల్’ బూస్ట్ బొనాంజా: హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్స్ పై భారీ ఫోకస్..

కేంద్ర బడ్జెట్ 2026 యువత ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్‌లో విద్య, ఉపాధి, ఆరోగ్యం అనే మూడు కీలక స్తంభాలపై దృష్టి సారించారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా, విద్యను ఉపాధి వ్యవస్థాపకతతో అనుసంధానించారు.

విద్య, నైపుణ్యాభివృద్ధి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, లాజిస్టిక్స్ కారిడార్ల సమీపంలో 5 యూనివర్సిటీ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇది విద్యార్థులకు నేరుగా పరిశ్రమలతో సంబంధాన్ని కలిగిస్తుంది. మహిళా విద్యను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ఒక మహిళా హాస్టల్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ‘ఆరెంజ్ ఎకానమీ’గా పిలవబడే గేమింగ్, యానిమేషన్ రంగంలో 2030 నాటికి 20 లక్షల మంది నిపుణులు అవసరమని గుర్తించిన ప్రభుత్వం.. కొత్తగా 'కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను', దేశంలో ఒక 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్'ను ప్రకటించింది.

ఆరోగ్య రంగాన్ని కేవలం వైద్య సేవలకే కాకుండా ఉపాధి వనరుగా నిర్మలమ్మ మలిచారు. రాబోయే 5 ఏళ్లలో లక్ష మంది అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్, లక్షా 50వేల మంది కేర్ గివ్వర్స్ ని తయారు చేయడమే లక్ష్యంగా శిక్షణా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ముఖ్యంగా రేడియాలజీ, అనస్థీషియా వంటి విభాగాల్లో నైపుణ్యం పెంచనున్నారు. అలాగే దేశంలో మెడికల్ టూరిజం ప్రోత్సహించడానికి 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలను ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఆయుర్వేదం, యోగా కోసం మూడు కొత్త అఖిల భారత ఆయుర్వేద సంస్థలను (AIIA) ఏర్పాటు చేయనున్నారు.

టూరిజం రంగంలో 10వేల మంది గైడ్‌లకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు, 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ'ని ఏర్పాటు చేయనున్నారు. ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతల ప్రభావాన్ని అంచనా వేసి.. యువతకు భవిష్యత్తు ఉద్యోగాలను సిద్ధం చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. మొత్తానికి ఈ బడ్జెట్ యువతను కేవలం ఉద్యోగార్థులుగా మాత్రమే కాకుండా.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యులుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.