హైదరాబాద్‌కు బుల్లెట్ వేగం: బడ్జెట్‌లో 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించిన నిర్మలమ్మ

హైదరాబాద్‌కు బుల్లెట్ వేగం: బడ్జెట్‌లో 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించిన నిర్మలమ్మ

హైదరాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ కనెక్టివిటీని సమూలంగా మార్చేసేలా భారీ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడింటిని హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించడం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ నిర్ణయంతో దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ ఒక ప్రధాన రవాణా హబ్‌గా అవతరించబోతోంది.

నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో మూడు ప్రధాన మార్గాలను హైలైట్ చేశారు:

1. పుణె – హైదరాబాద్: పశ్చిమ భారతంతో భాగ్యనగరాన్ని వేగంగా అనుసంధానిస్తుంది.
2. హైదరాబాద్ – చెన్నై: ఓడరేవు నగరంతో వాణిజ్య సంబంధాలను బలపరుస్తుంది.
3. హైదరాబాద్ – బెంగళూరు: రెండు ఐటీ దిగ్గజ నగరాల మధ్య వేగం దూరాన్ని తగ్గించబోతోంది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాలంటే రైలులో కనీసం 8 నుండి 12 గంటల సమయం పడుతుండగా.. ఈ హైస్పీడ్ కారిడార్ పూర్తయితే కేవలం 2 నుండి 3 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని అంచనా. గంటకు 250 నుండి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల వల్ల నగరాల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. ఉదయం బెంగళూరు వెళ్లి పని ముగించుకుని సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే. అలాగే ఈ కారిడార్ల వెంబడి పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ పార్కులు ఏర్పడతాయి. దీనివల్ల వేల సంఖ్యలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

చెన్నై, పుణె వంటి నగరాల నుండి పర్యాటకులు తక్కువ సమయంలో హైదరాబాద్ చేరుకునే వీలు కలగటంతో పర్యాటక రంగానికి బూస్ట్ ఇవ్వనుంది రైల్ కారిడార్. ఈ హైస్పీడ్ రైళ్లు ఆగే స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరిగి, రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఈ కారిడార్లు కేవలం రైలు మార్గాలు మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు వృద్ధి కారిడార్లని నిర్మలమ్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు స్ఫూర్తితో.. ఈ కొత్త మార్గాలను స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.