దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME) కోసం కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా చిన్న పరిశ్రమలను గ్లోబల్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మూడు అంచెల వ్యూహాన్ని ఆమె ప్రకటించారు. ఇందులో భాగంగా రూ. 10వేల కోట్లతో 'SME గ్రోత్ ఫండ్' ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిధి ద్వారా అభివృద్ధి చెందుతున్న చిన్న పరిశ్రమలకు ఈక్విటీ రూపంలో ఆర్థిక మద్దతు లభిస్తుంది.
అంతేకాకుండా ఇప్పటికే ఉన్న 'సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్'కు అదనంగా మరో రూ.2వేల కోట్లను టాప్-అప్ చేస్తూ మంత్రి ప్రతిపాదించారు. దీనివల్ల నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న అనేక చిన్న తరహా పరిశ్రమలకు ఊపిరి పోసినట్లవుతుంది. కేవలం నిధులే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న 200 పురాతన పారిశ్రామిక క్లస్టర్లను ఆధునీకరించి, వాటికి పునర్వైభవం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది స్థానిక ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుంది.
స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ తయారీలో భారతదేశానికి ప్రపంచ స్థాయి హబ్‌గా ఎదిగే సత్తా ఉందని, ఆ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని నిర్మలమ్మ పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం, మార్కెటింగ్ సపోర్ట్, రుణ సదుపాయాలను సులభతరం చేయడం ద్వారా చిన్న పరిశ్రమల మార్జిన్లను కాపాడాలని బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయాలతో దేశీయ తయారీ రంగం మరింత బలోపేతం కానుందని నిపుణులు అంటున్నారు.
