బడ్జెట్ 2026: మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్మలమ్మ నుంచి కోరుకుంటోంది ఇవే..

బడ్జెట్ 2026: మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్మలమ్మ నుంచి కోరుకుంటోంది ఇవే..

కేంద్ర బడ్జెట్ 2026 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న తరుణంలో.. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే కోట్లాది మంది సామాన్యులు ఈ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ల నియంత్రణ సంస్థ AMFI ప్రభుత్వం ముందు ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చే పలు ప్రతిపాదనలను ఉంచింది. 

1. డెట్ ఫండ్లకు 'ఇండెక్సేషన్' ఊరట:
గత బడ్జెట్‌లలో డెట్ మ్యూచువల్ ఫండ్లకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడం వల్ల ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణ ప్రభావంతో సంబంధం లేకుండా పూర్తి లాభంపై పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది డెట్ ఫండ్ల ఆకర్షణను తగ్గించింది. అందుకే మళ్లీ ఇండెక్సేషన్ ప్రయోజనాలను పునరుద్ధరించాలని యాంఫీ కోరుతోంది. దీనివల్ల రిటైర్మెంట్ ప్లానింగ్ చేసేవారికి, రిస్క్ తక్కువగా కోరుకునే వారికి పన్ను భారం తగ్గి, మెరుగైన రిటర్న్స్ వస్తాయి.

2. కొత్తగా డెట్ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్:
ప్రస్తుతం మనకు ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్స్ ద్వారా పన్ను మినహాయింపులు ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారి కోసం డెట్ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదన వచ్చింది. ఇది డెట్ ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెడుతూనే సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కల్పిస్తుంది. రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే మధ్యతరగతి వారికి ఇది గొప్ప వరం కానుంది.

3. పన్ను మినహాయింపు పరిమితి పెంపు:
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.లక్షా 25వేల నుండి రూ.2 లక్షలకు పెంచాలని యాంఫీ కోరింది. ఇది జరిగితే SIPల ద్వారా చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల ప్రజలు దీర్ఘకాలం పాటు మార్కెట్‌లో పెట్టుబడులు కొనసాగించడానికి ఆసక్తి చూపుతారు.

4. 5 ఏళ్లు ఉంచితే పన్ను లేదు:
పెట్టుబడిదారులలో క్రమశిక్షణను పెంచడానికి ఒక వినూత్న ప్రతిపాదన వచ్చింది. ఎవరైనా ఇన్వెస్టర్ తన మ్యూచువల్ ఫండ్ యూనిట్లను 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం తన వద్దే ఉంచుకుంటే, వాటిపై వచ్చే లాభాలకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వాలని యాంఫీ సూచించింది. ఇది ఇన్వెస్టర్లను స్వల్పకాలిక ట్రేడింగ్‌కు దూరం చేసి, సంపద సృష్టి వైపు మళ్లిస్తుంది.

5. పెన్షన్ ఫండ్లకు సమాన హోదా:
నేషనల్ పెన్షన్ సిస్టమ్ తరహా పన్ను ప్రయోజనాలను మ్యూచువల్ ఫండ్ల రిటైర్మెంట్ స్కీమ్స్‌కు కూడా కల్పించాలని పరిశ్రమ కోరుతోంది. దీనివల్ల ప్రజలకు తమ పదవీ విరమణ ప్రణాళికలో మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి.

మొత్తానికి బడ్జెట్ 2026 మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటే, సామాన్య ప్రజల పొదుపు పెట్టుబడిగా మారి దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుంది.