నాలుగు రాష్ట్రాలకు బడ్జెట్ లో రూ.2.27 లక్షల కోట్లు

నాలుగు రాష్ట్రాలకు బడ్జెట్ లో రూ.2.27 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాంలో హైవే ప్రాజెక్టుల కోసం బడ్జెట్ లో రూ.2.27 లక్షల కోట్లు కేటాయించింది. తమిళనాడుకు రూ.1.03 లక్షల కోట్లు ఇచ్చింది.  ఈ నిధులను రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ కారిడార్లు, 3,500 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణానికి ఖర్చు పెడతారు. తమిళనాడులో మదురై కొల్లం, చిత్తూరు థట్చూర్ కారిడార్ల నిర్మాణం వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుందని  నిర్మలా సీతారామన్ తెలిపారు.   కేరళలో 1,100 కిలోమీటర్ల హైవేల కోసం రూ.65వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఇందులో 600 కిలోమీటర్ల మేర ముంబై కన్యాకుమారి కారిడార్ ఉన్నట్టు తెలిపారు. వెస్ట్ బెంగాల్ లో రూ.20 వేల కోట్లతో 675 కిలోమీటర్ల హైవే వర్క్స్ చేపడుతామని నిర్మలా సీతారామన్ అన్నారు. కోల్ కతా సిలిగురి రోడ్డును అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. అస్సాంలో ప్రస్తుతం రూ.19 వేల కోట్లతో హైవే పనులు జరుగుతున్నాయని, వచ్చే మూడేళ్లలో మరో 34 వేల కోట్లతో 1300 కిలోమీటర్లకుపైగా హైవేల నిర్మాణం చేపడుతామన్నారు. అస్సాం, వెస్ట్ బెంగాల్ లోని టీ వర్కర్లు ముఖ్యంగా మహిళలు, పిల్లల  కోసం రూ.1,000 కోట్లు కేటాయించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కొచ్చి మెట్రో ఫేజ్ 2, చెన్నై మెట్రో ఫేజ్ 2 చేపడుతామన్నారు.

ఈసీకి వెయ్యి కోట్లు

ఎన్నికల సంఘానికి నిధుల కేటాయింపు కోసం కేంద్ర న్యాయ శాఖకు బడ్జెట్ లో రూ.1,005 కోట్లు a. ఈవీఎంల కొనుగోలు, మెయింటెనెన్స్, వీవీప్యాట్స్ కోసం ఈ నిధులు ఇస్తారు.  ఓటరు గుర్తింపు కార్డుల కోసం రూ.7.20 కోట్లు, ఇతర ఖర్చుల కోసం రూ .57.10 కోట్లు కేటాయించారు. ద్వారకలో ఎన్నికల సంఘం భవన నిర్మాణం,  భూమి కొనుగోలు సంబంధిత ఖర్చుల కోసం ఎలక్షన్ కమిషన్​కు విడిగా రూ .249.16 కోట్లు బడ్జెట్​లో కేటాయించారు.