పురుగుల అన్నం ఎట్ల తినాలే

పురుగుల అన్నం ఎట్ల తినాలే

మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం పెడుతున్నరు మేం ఎట్లా తినాలంటూ ఆదిలాబాద్‌ పట్టణంలోని గవర్నమెంట్ గర్ల్స్‌ హైస్కూల్ స్టూడెంట్లు మంగళవారం రోడ్డెక్కారు. అన్నం ప్లేట్లతో సరాసరి కలెక్టరేట్‍కు వచ్చిన మెయిన్‌ ఎంట్రెన్స్‌ ఎదుట ధర్నా దిగారు.  నాసిరకంగా భోజనం పెడుతున్న వంట ఎజెన్సీపై చర్య తీసుకోవాలని నినదించారు. సమస్య తెలుసుకునేందుకు వారి వద్దకు వచ్చిన కలెక్టర్‍ దివ్యదేవరాజన్‍ ముందుగా విద్యార్థి సంఘాల లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారిస్తాను కదా.. ఇంత మంది ఆడపిల్లల్ని రోడ్డుపైకి తీసుకువస్తరా అని మండిపడ్డారు. ఎవరైనా చెబితే వచ్చారా లేదంటే సమస్యతో మీకు మీరే వచ్చారా అని స్టూడెంట్లను ప్రశ్నించారు. దీంతో పిల్లలు ప్లేట్లలో పురుగుల అన్నం చూపిస్తూ సమస్యను కలెక్టర్‌కు వివరించారు. కొన్ని రోజులుగా నాసిరకం భోజనం పెడుతున్నారని.. తినలేకపోతున్నామని చెప్పారు. నాణ్యమైన భోజనమందించేలా చూడాలని కోరారు. బడిలో మంచి నీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని తెలిపారు. వారి సమస్యలు విన్న కలెక్టర్‍ కొద్దిసేపట్లో డీఈవోను మీ స్కూల్‌కు పంపిస్తానని ఎంక్వైరీ తర్వాత చర్యలు తీసుకుంటానని చెప్పడంతో స్టూడెంట్లు అక్కడి నుంచి బడికి వెళ్లారు.

ఎండీఎం ఎజెన్సీ సస్పెన్షన్‍..

హెచ్ఎం, ముగ్గురు టీచర్లకు నోటీసులు
 కలెక్టర్‍ ఆదేశాలతో డీఈవో ఎ.రవీందర్‍రెడ్డి.. ఎంఈవో జయశీలతో కలిసి గర్ల్స్ హైస్కూల్‍ను సందర్శించారు. స్టూడెంట్స్‌ కోసం వండిన వంటల్ని పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి రోజు మధ్యాహ్న భోజనం ఎలా ఉంటోందని అడిగి తెలుసుకున్నారు. మెయింటెనెన్స్‌ సరిగా లేదని గుర్తించిన ఆయన స్కూల్‍ ఎండీఎం ఏజెన్సీ పది రోజుల పాటు సస్పెండ్‍ చేశారు. భోజనం బాగుందా లేదా అని రోజు చెక్‌ చేయాల్సిన హెచ్ఎం నెహరాజహాన్‍, ఎండీఎం సూపర్‍విజన్ కమిటీ సభ్యులు సాజీదాబేగం, సారా ఖాతూన్‍, జ్యోతి అనే ముగ్గురు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.