విశ్వసనీయ జర్నలిజంతోనే.. చైతన్య సమాజ నిర్మాణం

విశ్వసనీయ జర్నలిజంతోనే.. చైతన్య సమాజ నిర్మాణం

ప్రజాస్వామ్య  సౌధానికి,  పార్లమెంటరీ  వ్యవ స్థకు  నాలుగో  పిల్లర్‌‌‌‌‌‌‌‌గా  పిలిచే  మీడియా  నేడు  పలు సవాళ్లను ఎదుర్కొంటోంది.   వార్తాపత్రికలు  ప్రతిదినం  ప్రపంచ వార్తలను మన కళ్ల ముందు ఉంచుతాయి.  దేశ ప్రజల గళాలుగా పత్రికలు  నిలుస్తున్నాయి.  ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య పటిష్టమైన వారధిగా వార్తా పత్రికలు సేవలు చేస్తున్నాయి.  

అవినీతిని బయటపెట్టడం,  అక్రమార్కుల భరతం పట్టడం,  సమ్మిళిత  అభివృద్ధికి ఉత్ప్రేరకంగా నిలవడం, పేదల పక్షాన నిలబడి  పోరాడడంలాంటి   ప్రధాన  కర్తవ్యాలను  వార్తాపత్రికలు నిర్వహిస్తున్నాయి.  భావ ప్రకటన స్వేచ్ఛకు  ప్రతిరూపంగా  వార్తాపత్రికలు  నిలవాలి. అయితే, విలువలతో  కూడిన నిష్పక్షపాత  వార్తలను  అందించే  పత్రికలు  రోజురోజుకూ  తగ్గుతున్నాయనే  అభిప్రాయం    క్రమంగా  బలపడుతున్నదని  నిపుణులు,  విశ్లేషకులు వాపోతున్నారు.  


భారత్​ తొలి వార్తాపత్రిక  ‘హిక్కీస్‌‌‌‌  బెంగాల్‌‌‌‌ గెజిట్‌‌‌‌’


ప్రతి ఏటా   జనవరి 29న  మన దేశంలో  ‘భారతీయ వార్తాపత్రికల దినోత్సవం(ఇండియన్ న్యూస్ పేపర్​ డే)’  నిర్వహించుట  ఆనవాయితీగా మారింది.  భారతదేశంలో తొలిసారి  జేమ్స్‌‌‌‌  ఆగస్టస్‌‌‌‌  హెక్కీ  నాయకత్వంలో  ‘హిక్కీస్‌‌‌‌ బెంగాల్‌‌‌‌ గెజిట్‌‌‌‌’ అనే  వారపత్రిక  కలకత్తా నుంచి 29 జనవరి 1780న  వెలువడింది.  ఈ వార్తా పత్రిక  నిష్పక్షపాతంగా వార్తలను  ప్రజలకు చేర్చడంతో  భయపడిన నాటి బ్రిటీష్‌‌‌‌ ప్రభుత్వం 1782లో  దానిని రద్దు చేయడం  జరిగింది.  భారతీయ  వార్తాపత్రికల దినోత్సవం-2026  ఇతివృత్తంగా  ‘సాధికారత,  విషయ చైతన్యం కలిగిన సమాజం కోసం విశ్వసనీయమైన జర్నలిజం’ అనే  అంశాన్ని  తీసుకోవడం ద్వారా  వార్తాపత్రికల  ప్రాముఖ్యతను తెలియజేసినట్లు అవుతున్నది. 
 

పత్రికా స్వేచ్ఛయే ప్రజాస్వామ్యం


ప్రజాస్వామ్య  విలువల పరిరక్షణ,  ప్రభుత్వ పాలనలో  పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం ద్వారా  ప్రజలకు,  ప్రభుత్వాలకు మధ్య అనుసంధానకర్తలుగా  వార్తాపత్రికలు నిలవాలి.   భావప్రకటనా స్వేచ్ఛను కాపాడడం, అవినీతి,  అక్రమాలు జరుగకుండా ‘వాచ్‌‌‌‌డాగ్’‌‌‌‌ వలె పని చేయాలి.   ప్రజల  బతుకు వెతలను ప్రభుత్వానికి చూపడం,   ప్రజలను చైతన్యవంతం చేయడంలాంటి అనేక ప్రధాన ప్రయోజనాలను  వార్తాపత్రికలు కలిగించాలి.  ఇలాంటి ప్రయోజనాలకు తోడుగా  ప్రజలను విద్యావంతులుగా మార్చడం,  సమాచార జ్ఞాన నైపుణ్యాలను పెంచడం,  సమకాలీన సమస్యలను లోతుగా విశ్లేషించడం చేయాలి.  రహస్య చీకటి ఒప్పందాలను  బయట పెట్టడం ద్వారా ప్రజల ప్రయోజనాలకు భంగం కలగకుండా వార్తా పత్రికలు కృషి చేయాలి.  పత్రికా స్వేచ్ఛయే ప్రజాస్వామ్యం అని,  జర్నలిజం  లేకుండా  ప్రజలకు  నిజమైన స్వేచ్ఛలేదని తెలుసుకోవాలి.   సమ్మిళిత సామాజిక అభివృద్ధికి పత్రికలు ఉత్ప్రేరకాలు అని, వార్తాపత్రికలు ప్రజలకు అమూల్య  సేవకులని భావించాలి.  

వార్తాపత్రికలను ప్రోత్సహించాలి

డిజిటల్‌‌‌‌  టెక్నాలజీ  వరదలో సంప్రదాయ వార్తాపత్రికల ఆదరణ  క్రమంగా కొట్టుకుపోతున్నది.  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌  పత్రికలు,  సోషల్‌‌‌‌ మీడియా పోస్టింగ్స్‌‌‌‌తో  పాఠకుల్లో వార్తాపత్రికల పట్ల దృష్టికోణం మారుతున్నది.  క్షణాల్లో  డిజిటల్‌‌‌‌ వేదికల్లో  ప్రపంచ వార్తలు ప్రజలకు చేరుతున్నాయి. టీవీ చానెల్స్‌‌‌‌ 24 గంటల  వార్తలతో  పేపర్‌‌‌‌ చదవాలనే  అలవాటు  క్రమంగా తగ్గుతున్నది.  వార్తాపత్రికల్లో ప్రకటనల రెవెన్యూ తగ్గడం, వినియోగదారుల అభిరుచులు మారడం, వార్తాపత్రికల  మధ్య  పోటీతత్వం పెరగడం,  వార్తాపత్రికల  ముద్రణ / నిర్వహణ  ఖర్చులు పెరగడం వాటి  మనుగడకు  ఆటంకంగా  మారింది.   ఎల్లో జర్నలిజం లాంటి  సవాళ్ల నడుమ వార్తాపత్రికల  మనుగడ  ప్రశ్నార్థకంగా మారింది.   రానున్న రోజుల్లో  వార్తాపత్రిక  మనుగడ  సుసాధ్యం  కావడానికి  నిక్కచ్చి వార్తలను అందించడంతోపాటు  నాణ్యమైన  సమాచారం చేరవేయాలి.  

ప్రతిభావంతులైన నిజాయితీపరులు మాత్రమే విలేకరులుగా సేవలు అందించాలి.  పాఠకుల అభిరుచుల ఆధారంగా పత్రికల్లో  మార్పులు చేయడం, ప్రభుత్వాలు తమ ప్రకటనలతో, పౌరసమాజం ఆదరణతో  ప్రోత్సహించాలి.  ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని  ‘భారతీయ వార్తాపత్రికల దినోత్సవం’ వేదికగా  పౌర సమాజం  పత్రికలను ఆదరించాలి.  బాధ్యతగల  పౌరులుగా  నిలుద్దాం,  మన  వార్తాపత్రికలను  మనమే కాపాడుకుందాం. 

- డా. బుర్ర  మదుసూధన్ రెడ్డి