హైదరాబాద్, వెలుగు: వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ఇంటిని జప్తు చేసే అధికారం కేవలం మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఉంటుందని, పోలీసులకు అటువంటి అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని అయిదంతస్తుల భవనంలో అద్దెకు ఉంటున్న వారు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు ఆ భవనాన్ని జప్తు (సీల్) చేశారు.
దీనిని సవాల్ చేస్తూ భవన యజమాని అల్లూరి సీతారామరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ వేణుగోపాల్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా భవనాన్ని జప్తు చేయడం చట్టవిరుద్ధమని వాదించారు. ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానిని.. అక్కడ జరిగే రోజువారీ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు బాధ్యుడిని చేయలేమని కోర్టుకు విన్నవించారు.
ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధంలో భాగంగానే భవనాన్ని జప్తు చేశామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి స్పందిస్తూ..ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం, వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించి పోలీసులు ఇచ్చిన సమాచారంతో నోటీసును జారీ చేసి జప్తు చేసే అధికారం మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
పోలీసులకు అలాంటి అధికారం ఉండదని పేర్కొన్నారు. కేవలం యజమాని అయినంత మాత్రాన బిల్డింగులో జరిగే తప్పిదాలకు సమ్మతి తెలిపినట్లు భావించలేమన్నారు. వెంటనే భవనం సీలును తొలగించి యజమానికి అప్పగించాలని ఆదేశించారు. ఒకవేళ జప్తు తప్పనిసరని భావిస్తే మేజిస్ట్రేట్ ద్వారా చర్యలు తీసుకోవచ్చని సూచించారు.
