జూన్10 నుంచి భవన నిర్మాణ పనులు బంద్.. తాపీ మేస్త్రిలపై సెంట్రింగ్ కాంట్రాక్టర్లు అనుచిత వ్యాఖ్యలు

జూన్10  నుంచి భవన నిర్మాణ పనులు బంద్.. తాపీ మేస్త్రిలపై సెంట్రింగ్ కాంట్రాక్టర్లు అనుచిత వ్యాఖ్యలు
  •     భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామలి ఐలన్న

ముషీరాబాద్, వెలుగు: తాపీమేస్త్రీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సెంట్రింగ్ కాంట్రాక్టర్లు వెంటనే వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామలి ఐలన్న డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తాపీమేస్త్రీ ఆత్మగౌరవ ధర్నా చేపట్టారు. 

గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సురా వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ నిర్మాణాలు చేపట్టాలన్న తాపీమేస్త్రీలు, సెంట్రింగ్ మేస్త్రీలు ఎంతో కీలకమన్నారు. వీరి మధ్య రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ మంత్రి రాజీ కుదర్చాలని కోరారు. 

ఐలన్న మాట్లాడుతూ.. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామన్నారు. ఈ నెల 10 నుంచి భవన నిర్మాణ పనులను బంద్ చేస్తామని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్, ఉపాధ్యక్షుడు మురుగు యాదగిరి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చొక్కాపురం శ్రీరాములు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఆదిరాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.