
బల్గేరియా యూరప్ లోని చిన్న దేశాల్లో ఒకటి. దీని జనాభా దాదాపు 70 లక్షలు. ఇందులో 50 లక్షల మంది రకరకాల పనులు చేసుకుని బతుకుతున్నారు. వచ్చే డబ్బుపై దేశ ఆదాయ పన్నుకు కొంత చెల్లిస్తున్నారు. వాళ్ల వివరాలను ఆ డిపార్టుమెంట్ డేటా బేస్‌లో దాచి ఉంచింది. ఇప్పుడు ఈ వివరాలన్నింటినీ హ్యాకర్లు కొల్లగొట్టారు. ఎవరు కావాలన్నా డౌన్ లోడ్ చేసుకునేందుకు ఫ్రీగా అందుబాటులో పెట్టారు.
దీనిపై సగటు బల్గేరియన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ‘హ్యాకర్లు మా వివరాలన్నీ తెలుసుకున్నారు. మా ఫోన్ నంబర్లు. మా పుట్టిన రోజులు. మా ఇంటి అడ్రసులు. మేం ఏం పని చేస్తాం. ఇలా అన్నీ పబ్లిక్ గా పెట్టేశారు. బహుశా మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు ఇవే ప్రదేశాల్లో మేం ఉంటాం. పాస్ వర్డులు మార్చుకోవచ్చు.. కానీ, పుట్టిన రోజులు మార్చుకోలేం. హ్యాకింగ్ జరిగిందని ఇప్పటికిప్పుడు ఇళ్లు మారలేం కదా. మాకేదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదీ’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు.
ఈయూలో కఠిన చట్టం
పెరిగిపోతున్న హ్యాకింగ్ చట్టాలను ఎదుర్కొనేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) గతేడాది కఠిన చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడిది బల్గేరియన్ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. హ్యాకింగ్ కు గురయ్యేలా యూజర్ల డేటాను ఉంచితే, భారీ ఫైన్లు చెల్లించాలనే రూల్ చట్టంలో ఉంది. ఇప్పుడు చట్టాన్ని తెచ్చిన దేశాల్లో ఒకటైన బల్గేరియాను స్వయంగా ఫైన్ బారిన పడింది. డార్క్ వెబ్ లో దొరుకుతున్న టూల్స్ తో హ్యాకర్లు ఈజీగా ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. హ్యాకింగ్ అటాక్ పై బల్గేరియన్ కమిషన్ ఆఫ్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (బీసీపీడీపీ) విచారణకు ఆదేశించింది. బల్గేరియన్ సైబర్ సెక్యూరిటీకి చెందిన ఓ ఆఫీసర్ ను ఎంక్వైరీ టీమ్ అరెస్టు చేసింది. హ్యాకింగ్ కు వాడిన కంప్యూటర్, సాఫ్ట్ వేర్ ఆధారంగా అతన్ని అనుమానిస్తున్నారు. అతని వద్ద ఉన్న మొబైల్స్, కంప్యూటర్లు, డైవ్స్ ను సీజ్ చేశారు. పూర్తి విచారణ జరిగే వరకూ వివరాలు వెల్లడించలేదని బీసీపీడీపీ చెప్పింది.