
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మున్సిపాలిటీ లోని మినీ రవీంద్రభారతి పనులను బీఆర్ఎస్నేతలు నాసిరకంగా చేపట్టి కోట్ల రూపాయల బిల్లులు ఎత్తారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. శనివారం పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2006లో నాటి ఎంపీ జైపాల్ రెడ్డి నిధులతో మినీ రవీంద్రభారతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, దీనికి నాటి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రూ.1.30 కోట్లు కేటాయించారని తెలిపారు.
మిగిలిన టీఎఫ్ యూ ఐడీసీ రూ.9 కోట్ల నిధులతో భవనాన్ని నిర్మించారని చెప్పారు. అయితే మొదట కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థకు బిల్లులు రాకుండా చేసి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు తన బినామీలకు ఆ కాంట్రాక్ట్ అప్పగించారని తెలిపారు. ఇష్టమొచ్చినట్లు అంచనాను పెంచి నాటి మున్సిపాలిటీ డీఈ సాయిలక్ష్మి సహకారంతో దొంగ బిల్లులు డ్రా చేసి నాసిరకం పనులను చేశారని ఆరోపించారు. అందుకు నిదర్శనమే ఇటీవల ఓ సభలో ఏసీలు పనిచేయలేదని, కూలర్లతోనే సభను కొనసాగించారని వివరించారు. ఈ మినీ రవీంద్రభారతికి కేసీఆర్ పేరు పెట్టేందుకు ఎలాంటి తీర్మానం, పర్మిషన్ లేదన్నారు. దీంతో మున్సిపల్ ఆఫీసర్లు కేసీఆర్ పేరును తొలగించారని చెప్పారు. నాసిరకం నిర్మించిన మినీ రవీంద్రభారతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.