
- ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే బాలూనాయక్ అధికారులకు సూచించారు. శనివారం దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ధర్తీ ఆబ జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వ 30 శాతం వాటాతో ధర్తీ ఆబజన్ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని 29 గిరిజన గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. గిరిజన తండాల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక తండా నుంచి మరో తండాకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. 29 గ్రామాల్లో సర్వే నిర్వహించి సోలార్ ద్వారా వ్యవసాయ బోర్లు, వీధిలైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ త్రిపాఠి, స్థానిక సంస్థల ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి చత్రునాయక్, డీఆర్డీఏ శేఖర్ రెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.