మూసాపేట మెట్రో స్టేషన్లో బుల్లెట్ కలకలం

మూసాపేట మెట్రో స్టేషన్లో బుల్లెట్ కలకలం

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి పరిధిలోని మూసాపేట మెట్రో స్టేషన్​లో బుల్లెట్ కలకలం సృష్టించింది. మూసాపేట పరిధిలోని ప్రగతినగర్​లో ఉంటున్న బాలుడు(12) శనివారం రాత్రి మూసాపేట మెట్రో రైలు ఎక్కడానికి స్టేషన్​కు వెళ్లాడు. మెట్రో రైల్ సిబ్బంది తనిఖీల్లో అతని జేబులో ఒక బుల్లెట్​ లభించింది. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

విచారణలో బాలుడి సవతి తండ్రి మహ్మద్ ​ఆలం(28) వద్ద నుంచి బుల్లెట్​ను బాలుడు తీసుకున్నట్టు తేలింది. బిహార్​కు చెందిన ఆలం కొంతకాలంగా బాలుడి తల్లితో కలిసి ఉంటూ కూలి పని చేస్తున్నాడు. తన స్వరాష్ట్రం నుంచి బుల్లెట్​తీసుకువచ్చినట్టు ఆలం అంగీకరించినట్టు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి కూకట్​పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.