లోపాన్ని జయించి.. ఆత్మ విశ్వాసంతో ముందడుగేసి..

లోపాన్ని జయించి.. ఆత్మ విశ్వాసంతో ముందడుగేసి..

ఇరవై ఐదేండ్ల రేషమ్‌‌ తల్వార్‌‌‌‌ పుట్టుకతోనే చూపు కోల్పోయింది. ఆ లోపాన్ని జయించి రేడియో జాకీగా, సింగర్‌‌‌‌గా, వాయిస్‌‌ ఓవర్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌గా రాణిస్తోంది. రేషమ్‌‌ సొంతూరు ఢిల్లీ. ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చిన్నప్పటి నుంచే బ్రెయిలీ లిపి నేర్పించారు రేషమ్‌‌ తల్లిదండ్రులు. వస్తువుల్ని తాకుతూ, వాటిని స్పర్శ ద్వారా ఫీలవుతూ  ఎలా గుర్తుపట్టాలో నేర్పించాడు అన్న. చుట్టుపక్కలవాళ్లు అనే మాటలేవి పట్టించుకోకుండా ధైర్యంగా ఎలా నిలబడాలో నేర్పించారు. ఆ ధైర్యమే ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, ఇందిరా గాంధీ నేషనల్‌‌ ఓపెన్‌‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌‌ పట్టా తీసుకునేలా చేసింది. 

తల్లిదండ్రులను చూసి..
రేషమ్‌‌ తల్లిదండ్రులిద్దరూ మ్యుజీషియన్స్​. దాంతో ఇద్దరూ కలిసి ఆమెకి సంగీతం నేర్పిస్తుంటారు. వాళ్ల పాటలు వింటూనే తను కూడా పాడటం నేర్చుకుంది. హార్మోనియం కూడా వాయించగలదు. స్కూల్లో జరిగే చాలా పాటల పోటీల్లో గెలిచింది. అలా కాలేజి కాంపిటీషన్స్‌‌లో పాడి మిస్‌‌ ఫ్రెషర్స్, మిస్‌‌ ఫేర్వెల్‌‌ టైటిల్స్‌‌ కూడా గెలుచుకుంది. అంతేకాదు ‘ది వాయిస్‌‌, ఇండియన్ ఐడల్‌‌, సరిగమప’ లాంటి రియాలిటీ షోల్లో కూడా పార్టిసిపేట్‌‌ చేసింది. ‘ఎటిపికల్‌‌ అడ్వాంటేజెస్‌‌’ అనే ఫిజికల్లి డిజేబుల్డ్‌‌ గ్రూప్‌‌తో కలిసి ఇప్పటివరకు వెయ్యికిపైగా లైవ్‌‌ స్టేజ్‌‌ పర్ఫార్మెన్స్‌‌లు ఇచ్చింది. ‘రేడియో ఉడాన్‌‌’లో రేడియో జాకీగా కూడా పని చేసింది. హిందీ సినిమాలకు వాయిస్‌‌ ఓవర్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలబడుతోంది.

‘స్కూల్‌‌, కాలేజీలో నా ఫ్రెండ్స్‌‌, టీచర్స్‌‌ కూడా నా లోపాన్ని గుర్తు చేస్తూ హేళన చేసేవాళ్లు. అప్పుడు అమ్మానాన్న నా వెన్ను తట్టి ముందుకు నడిపించారు. నేనెప్పుడు బాధపడినా అన్నయ్య ధైర్యం చెప్పేవాడు. నా ఫ్రెండ్‌‌లా ఎప్పుడూ తోడుండేవాడు. లోపం ఉందని ఎవ్వరిని తక్కువగా చూడకండి. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపండి. వాళ్ల ప్రతి అడుగులో తోడుండి నడిపించండి’ అంటోంది రేషమ్‌‌ తల్వార్‌‌‌‌.