రోహిత్ తర్వాత భారత కెప్టెన్సీకి అర్హుడు ఎవరు..? మనసులో మాట బయటపెట్టిన అశ్విన్

రోహిత్ తర్వాత భారత కెప్టెన్సీకి అర్హుడు ఎవరు..? మనసులో మాట బయటపెట్టిన అశ్విన్

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భారత టెస్ట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకడంతో.. హిట్ మ్యాన్ వారసుడు ఎవరనే దానిపై జోరుగా చర్చలు ఊపందుకున్నాయి. మాజీ సీనియర్ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి భారత టెస్ట్ కెప్టెన్ ఎవరనే టాపిక్‎పై టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. తన యూట్యూబ్ షో ఆష్‎కి బాత్‎లో అశ్విన్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ తర్వాత జస్ప్రీత్ బుమ్రా భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీకి అర్హుడని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ ప్లేయర్లు రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో జట్టులో సీనియర్‎గా ఉన్న బుమ్రా కెప్టెన్‌గా ఉండాలని అశ్విన్ పేర్కొన్నాడు.

‘‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్‌లో పర్యటించే జట్టు పూర్తిగా కొత్త టీమ్. ఇంగ్లాండ్ టూర్‎కు వెళ్లే టీములో బహుశా బుమ్రా సీనియర్ ఆటగాడు. అతను తదుపరి భారత టెస్ట్ కెప్టెన్సీ రేసులో ఒకడు.  బుమ్రా కెప్టెన్సీకి అర్హుడని నేను భావిస్తున్నాను. కానీ సెలెక్టర్లు అతని శారీరక సామర్థ్యం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు’’ అని అశ్విన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

 రోహిత్ స్థానంలో భారత టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టడానికి యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం ముందంజలో ఉండగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. అయితే, జట్టులో కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ ప్లేయర్లు లేకపోవడం గిల్‎కు పెద్ద సవాల్‎గా మారుతోందని ఈ స్టార్ స్పిన్నర్ పేర్కొన్నాడు. 

ఇక.. కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్‎పైన అశ్విన్ స్పందించాడు. రోజుల వ్యవధిలోనే కోహ్లీ, రోహిత్ టెస్టుల నుంచి రిటైర్ అవుతారని అస్సలు ఊహించలేదన్నాడు. ఇది భారత క్రికెట్‌కు పరీక్షా సమయమని అన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శకానికి ఇది నాంది అని పేర్కొన్నాడు. కోహ్లీకి మరో రెండు సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా ఉందని.. రోహిత్ కనీసం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ వరకు అయినా కొనసాగుతాడని భావించానని చెప్పాడు. కానీ ఇద్దరు రోజుల వ్యవధిలోనే టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో జట్టులో నాయకత్వ శూన్యత ఏర్పడిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.