కారు టైర్ పంక్చర్ అయిందని చెప్పి..14.75 లక్షలతో పరార్

కారు టైర్ పంక్చర్ అయిందని చెప్పి..14.75 లక్షలతో పరార్
  • రైతు దృష్టి మరల్చి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
  • వనస్థలిపురం పరిధి ఎన్జీవోస్ కాలనీలో ఘటన

ఎల్ బీనగర్,వెలుగు:   బంగారం బ్యాంక్ లో కుదవపెట్టిన డబ్బును తీసుకెళ్తున్న రైతును దృష్టి మరల్చి రూ. 14.75లక్షలు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వనస్థలిపురం పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ కు చెందిన రైతు ఎలకొండ మల్లారెడ్డి(42) వ్యవసాయ పెట్టుబడికి, కుటుంబ అవసరాలకు 22తులాల నగలను సోమవారం వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుదవపెట్టి రూ. 14.75లక్షలు తీసుకున్నాడు.  తన కారులో డబ్బుల బ్యాగును పెట్టుకుని నాదర్ గుల్  వెళ్తున్నాడు. ఎన్జీవోస్ కాలనీకి  వెళ్లగానే బైక్ పై ఇద్దరు దుండగులు వెంబడించి కారు పంక్చర్ అయిందని మల్లారెడ్డికి చెప్పారు. 

కారుతో పాటే సమీపంలోని పంక్చర్ షాపు వరకు దుండగులు వెళ్లారు. అక్కడ ఒక దుండగుడు డైవర్ట్ చేసి మల్లారెడ్డితో మాట్లాడుతుండగా మరో వ్యక్తి కారులోని బ్యాగ్ ను తీసుకొని ఇద్దరూ పరార్ అయ్యారు. కొద్దిసేపటి తర్వాత కారులో బ్యాగ్ లేదని గుర్తించిన మల్లారెడ్డి తేరుకొని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో కేసు నమోదు చేసిస్పెషల్ టీమ్స్ తో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పక్కా ప్లాన్ ప్రకారమే రెక్కి వేసి చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానించారు. ఘటనా స్థలాన్ని ఎల్ బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఏసీపీ కాశీరెడ్డి పరిశీలించారు.